కొల్లాం బహిరంగ సభలో ప్రకాశ్‌కరత్
కొల్లాం : హిందూత్వ, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలను మరింత బలోపేతం చేస్తామని సిపిఎం సమన్వయ కర్త ప్రకాశ్ కరత్ స్పష్టం చేశారు. కేరళ సిపిఎం 24వ రాష్ట్ర మహాసభ ముగింపు సందర్భంగా కొల్లాంలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేరళలో పార్టీ సంస్థాగతంగా, రాజకీయంగా అత్యున్నత ఐక్యతను సాధించిందని చెప్పారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి పార్టీ మరింత బలాన్ని పొందిందని చెప్పారు. పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మాజీ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌ల నాయకత్వంలో కన్నూర్‌లో పార్టీ 23వ రాష్ట్ర మహాసభ నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హిందూత్వ, కార్పొరేట్ ఆధిపత్య శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కాలంలో పార్టీ విస్తృతంగా పోరాడిందని తెలిపారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, సమాజంలోని అణగారిన వర్గాల సమస్యలపై ఉద్యమించిందని చెప్పారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వ్యవసాయ సంక్షోభం, నయా ఉదారవాద విధానాల వల్ల కలిగే సామాజిక సమస్యలకు, ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లకు వ్యతిరేకంగా అచంచల నిబద్ధతతో పార్టీ పోరాడిందని తెలిపారు. నయా ఉదారవాద విధానాలు, కార్పొరేట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలకు పార్టీ సిద్ధమైందని చెప్పారు. హిందూత్వ శక్తులు రాష్ట్రంలోని ప్రతి విభాగంలోకి చొరబడి విభజించడానికి, రాజకీయ ఆధిపత్యం పొందడానికి ప్రయత్నిస్తున్నాయని, ఈ ప్రయత్నాలను సిపిఎం నిరంతరం ప్రతిఘటించిందని, స్థిరంగా రాజకీయ ప్రచారం చేసిందని తెలిపారు.
కేంద్రం నిర్లక్ష్యం చేసినా కేరళ తన కాళ్లపై నిలబడుతుంది : ఎంవి గోవిందన్
కేరళను అభివృద్ధి చెందిన దేశాల ప్రమాణాలకు పెంచుతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ అన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యమని, కేరళలో అభివృద్ధి రంగంలో ఊహించని మార్పు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ”మేము అన్ని సంక్షోభాలనూ అధిగమిస్తాం. పార్టీ సవాళ్లను అధిగమించి బలంగా ముందుకు సాగుతుంది. ఈసారి రాష్ట్ర కమిటీలోకి 17 మంది కొత్త వారు చేరారు. మహాసభలో ఆరోగ్యకరమైన చర్చలు జరిగాయి. ” అని అన్నారు.
”కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ కేరళ తన కాళ్ల మీద తాను నిలబడుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. ”ఈ మహాసభ పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా మారింది. ఈ మహాసభతో కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి పార్టీని సిద్ధం చేయడమే తన లక్ష్యమని పార్టీ ప్రకటించింది. మెజారిటీ మతతత్వం, మైనారిటీ మతతత్వంతో కలిసిపోయి అందరికీ ఉమ్మడి శత్రువు సిపిఎం అని చేస్తోన్న ప్రచారాన్ని మనం ఎదుర్కోవాలి. ప్రజల మద్దతుతో మనం రెండోసారి అధికారంలోకి వచ్చినట్లే, 2026 ఎన్నికల్లో, దానికి ముందు జరిగే స్థానిక ఎన్నికల్లో మనం విజయం సాధించాలి. అన్ని ప్రతికూల పరిస్థితులనూ ఎదుర్కొంటూ ముందుకు సాగగలగాలి. అది సాధ్యం కావాలంటే మనం మన సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవాలి” అని గోవిందన్ అన్నారు.
కొల్లాంలో నాలుగు రోజుల పాటు జరిగిన సిపిఎం కేరళ రాష్ట్ర 24వ మహాసభ రెడ్ షర్ట్ వలంటీర్ల మార్చ్‌తో ఆదివారం ముగిసింది. ఈ మహాసభకు 530 మంది ప్రతినిధులు మహాసభకు హాజరయ్యారు. మహాసభకు పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, బృందాకరత్, సుభాషిణి అలీ, బివి రాఘవులు, అశోక్ ధావలే, ఎంఎ బేబి, ఎ. విజయరాఘవన్ తదితరులు హాజరయ్యారు.
కేరళ రాష్ట్ర కార్యదర్శిగా ఎంవి గోవిందన్
16 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గం
89 మందితో రాష్ట్ర కమిటీ ఎన్నిక
సిపిఎం కేరళ రాష్ట్ర కార్యదర్శిగా ఎంవి గోవిందన్ తిరిగి ఎన్నికయ్యారు. 16 మంది రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులతో కలిసి 89 మందితో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికైంది. రాష్ట్ర రాజకీయ, నిర్మాణ నివేదికను రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై 47 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం రాష్ట్ర నూతన కమిటీని మహాసభ ఎన్నుకుంది. రాష్ట్ర కార్యదర్శిగా ఎంవి గోవిందన్ తిరిగి ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా పినరయి విజయన్, ఇపి జయరాజన్, కెకె శైలజ, థామస్ ఐజాక్, టిపి రామకృష్ణన్, కెఎన్ బాలగోపాల్, పి.రాజీవ్, కెకె జయచంద్రన్, విఎన్ వాసన్, సాజి చెరియన్, ఎం.స్వరాజ్, పిఎ మహ్మద్ రియాజ్, పికె బిజు, పుతలత్ దినేషన్, సిఎన్ మోహనన్ ఎన్నికయ్యారు. రాష్ట్ర కమిటీకి 17 మంది కొత్తగా ఎన్నికయ్యారు.