ఇజ్రాయిల్‌ దాష్టీకాన్ని ఖండించండి- సిపిఎం పొలిట్‌బ్యూరో పిలుపు

May 29,2024 08:43 #call, #CPM Politburo's

న్యూఢిల్లీ : రఫాలో నిర్వాసితులు తలదాచుకుంటున్న గుడారాల శిబిరంపై ఆదివారం రాత్రి ఇజ్రాయిల్‌ సాగించిన దురాగతాలను సిపిఎం తీవ్రంగా తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో మంగళవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ ఈ దాడిలో 45మంది అమాయక ప్రజలు చనిపోయారు. వీరిలో మహిళలు, పిల్లలు, వృద్ధులు 20 మంది దాకా వున్నారు. రఫాపై దాడిని తక్షణమే ఆపాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా, వాటిని బేఖాతరుచేస్తూ ఇజ్రాయిల్‌ సాయుధ బలగాలు అత్యంత అమానుషమైన రీతిలో దాడులు సాగిస్తున్నాయని పొలిట్‌బ్యూరో విమర్శించింది. గత ఏడు మాసాలుగా సాగుతున్న ఈ దాడుల్లో ఇప్పటివరకు 36వేల మందికి పైగా మరణించారు. ఇంకా అనేక వేల మంది శిథిóలాల కింద సమాధి అయిపోయారు. ఇజ్రాయిల్‌ దారుణాలను, అత్యాచారాలను వ్యతిరేకిస్తూ, రఫాపై దాడులను తక్షణమే ఆపాలని, కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ ప్రజాస్వామిక, శాంతి కాముకులు గట్టిగా గొంతెత్తాలని పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది. మోడీ ప్రభుత్వం వెంటనే ఇజ్రాయిల్‌ తన నరహంతక యుద్ధాన్ని నిలిపివేయాలని, కాల్పుల విరమణకు అంగీకరించాలని డిమాండ్‌ చేయాలి. ఇజ్రాయిల్‌కు అన్ని రకాల ఆయుధాల ఎగుమతులను ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని, ఇజ్రాయిల్‌ ఈ ఆయుధాలనే తన ఆటవిక యుద్ధంలో ఉపయోగిస్తున్నందున ఈ చర్య తప్పనిసరి అని పొలిట్‌బ్యూరో పేర్కొంది.

➡️