సైనిక్‌ స్కూళ్లలో కాషాయీకరణ ఆపండి! – సిపిఎం పొలిట్‌బ్యూరో

Apr 3,2024 23:01 #cpm politburo, #prakatana

న్యూఢిల్లీ : సైనిక్‌ స్కూళ్లలో కాషాయీకరణ యత్నాలను విరమించుకోవాలని, వాటి జాతీయ, లౌకిక స్వభావాన్ని నిలబెట్టాలని సిపిఐ(ఎం) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ పొలిట్‌బ్యూరో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో సైనిక్‌ స్కూళ్ల నిర్వహణలో ప్రయివేటు రంగాల భాగస్వామ్యానికి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించడం పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సైనిక్‌ స్కూళ్లు సాంప్రదాయకంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి కలిగిన సైనిక్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. దేశంలో ప్రతిష్టాత్మకమైన నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ నావల్‌ అకాడమీల్లో ప్రవేశం పొందేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో ఈ సైనిక్‌ స్కూళ్లు చాలా ముఖ్యమైన భూమిక వహిస్తున్నాయి. ఈ సైనిక్‌ స్కూళ్ల నుండి ఉత్తీర్ణులై బయటకు వచ్చిన విద్యార్థులు గణనీయ సంఖ్యలో దేశ రక్షణ బలగాల్లో ఉన్నత బాధ్యతలు చేపట్టినవారున్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన విధానం కేవలం ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం (పిపిపి) నమూనాలో నిధుల సమీకరణ, మౌలిక సదుపాయాల కల్పనలో పరస్పర పంచుకోవడానికి మాత్రమే పరిమితం కాదు, ఎస్‌ఎస్‌ఎస్‌తో కుదుర్చుకుంటున్న ఒప్పందాల్లో గణనీయమైన సంఖ్యలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపితో సంబంధాలున్న సంస్థలను కూడా ప్రభుత్వం చేర్చుతోందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ప్రభుత్వ ఈ చర్యను సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. విద్య కాషాయీకరణను ఈ స్కూళ్లపై రుద్దడం వల్ల మన సైనిక వ్యవస్థల్లో ఉన్నత లౌకిక ప్రమాణాలపై దాని ప్రభావం పడే ప్రమాదం వుందని పొలిట్‌బ్యూరో హెచ్చరించింది. సైనిక పాఠశాలల జాతీయ, లౌకిక స్వభావాన్ని పరిరక్షించేందుకు గాను ప్రభుత్వం తక్షణమే ఈ చర్యను ఉపసంహరించుకోవాలని సిపిఐ(ఎం) డిమాండ్‌ చేసింది.

➡️