సీతారాం ఏచూరి నగర్ (మదురై)నుండి ప్రజాశక్తి ప్రతినిధి : దేశవ్యాప్తంగా కోట్లాది మత్స్యకారుల జీవనాధారాన్ని నాశనం చేస్తున్న డీప్ సీ మైనింగ్ విధానాన్ని నిషేధిóంచాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు అఖిలభారత మహాసభలో తీర్మానం చేసింది.కార్పొరేట్ లాభాలను దష్టిలో ఉంచుకుని ప్రకతి వనరులను ప్రైవేట్ రంగానికి అప్పగిస్తూ, సముద్ర జీవవైవిధ్యాన్ని అస్థిరపరుస్తూ, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను ఈ విధానం క్షీణింపచేస్తోందని తీర్మానంలో పేర్కొన్నారు. విధ్వంసకరమైన ఈ చర్య నుంచి మోడీ ప్రభుత్వం తక్షణమే వెనక్కి తగ్గాలని, కేంద్ర కమిటీ సభ్యుడు టి.ఎం. థామస్ ఐజాక్ ప్రవేశపెట్టిన తీర్మానంలో డిమాండ్ చేశారు. ఈ తీర్మానానికి కేంద్ర కమిటీ సభ్యుడు అలీ కిశోర్ పట్నాయిక్ మద్దతు ఇచ్చారు. ‘సముద్ర మైనింగ్ చట్టం (2002)కు 2023లో చేసిన సవరణలతో, లోతు సముద్రాల్లోని ఖనిజ వనరులను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు దోపిడి చేసుకునేలా అవకాశం కల్పించారు. 2023 వరకు, తీర ప్రాంతాల్లో మైనింగ్ ప్రారంభించేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ లాంటి సంస్థలకే అనుమతి ఉండేది. కానీ చట్టంలో మార్పులు చేసిన తర్వాత, ప్రైవేట్ కంపెనీలకూ అనుమతి లభించింది. దీని ద్వారా అడ్డు అదుపు లేని వనరుల దోపిడికి తెరతీశారు. విచ్చలవిడిగా జరిగే ఈ మైనింగ్ వల్ల ప్రకతి సిద్ధంగా ఏర్పడిన రక్షణ వ్యవస్థలు బలహీనపడతాయి. ఫలితంగా సునామీ, తుపానులు, భూకంపాలు, సముద్ర జీవుల నాశనం వంటి విపత్తులు సంభవించే అవకాశం ఉంది. భారీ స్థాయిలో కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి. దీంతో గ్లోబల్ వార్మింగ్ మరింత తీవ్రతరం అవుతుంది.’ అని తీర్మానంలో పేర్కొన్నారు.
CPM Resolution: డీప్ సీ మైనింగ్‌ను నిషేధించండి
