లడఖ్‌ కార్యకర్తల నిరాహార దీక్షకు సిపిఎం సంఘీభావం

న్యూఢిల్లీ : రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో లడఖ్‌ను చేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో నిరవధిక దీక్ష చేపట్టిన లడఖ్‌ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ ప్రభృతులకు సిపిఎం పొలిట్‌బ్యూరో సంఘీభావం తెలియజేసింది. పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌, ఎంపి డాక్టర్‌ జాన్‌ బ్రిటాస్‌ దీక్షా శిబిరాన్ని మంగళవారం సందర్శించి, సంఘీభావాన్ని ప్రకటించారు. లడఖ్‌ నుండి దేశ రాజధాని వరకు శాంతియుతంగా పాదయాత్ర జరిపిన 150మంది కార్యకర్తలను ఢిల్లీలో ధర్నాకు అనుమతించకపోవడం మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రతిబింబిస్తోందని పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో విమర్శించింది. ధర్నాకు అనుమతించకపోగా వారిని అరెస్టు చేసి, వారిపట్ల అనుచితంగా వ్యవహరించడం, లడఖ్‌ భవన్‌కు మాత్రమే వారిని పరిమితం చేయడాన్ని ఆక్షేపించింది. దాంతో ఆ భవన్‌లోనే వారు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. లడఖ్‌ ప్రాంతాన్ని గిరిజనుల ఆమోదం లేకుండా కార్పొరేట్‌ మైనింగ్‌ కంపెనీలు, ఇతర ప్రైవేట్‌ ప్రాజెక్టులకు అప్పజెప్పే యత్నాలకు స్వస్తి పలకాలంటే దీనిని రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలనేది వారి ప్రధాన డిమాండ్‌. 2019 బిజెపి ఎన్నికల మేనిఫెస్టో కూడా ఈ మేరకు చర్య తీసుకుంటామని హామీ ఇచ్చింది. లడఖ్‌ను ఆరవ షెడ్యూల్‌లో చేర్చడానికి సిపిఎం మద్దతును తెలియజేస్తోంది. సంబంధిత మంత్రులు తక్షణమే సోనమ్‌ వాంగ్‌చుక్‌, ఆయన బృందంతో భేటీ కావాలని, ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

➡️