ముర్షీదాబాద్‌ హింసపై న్యాయ విచారణ :సిపిఎం డిమాండ్‌

  • వక్ఫ్‌ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ జిల్లాలో జరిగిన హింసాకాండపై కలకత్తా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ముర్షీదాబాద్‌లో ముగ్గురు మరణించడానికి దారి తీసిన హింసాకాండను అణిచివేయడంలో పోలీసులు సక్రమంగా వ్యవహరించలేదని సిపిఎం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీమ్‌ విమర్శించారు. ఈ ఘర్షణల వెనక గల వాస్తవాలను బయటపెట్టడానికి స్వతంత్ర దర్యాప్తు జరపడం అవసరమని అన్నారు. అందువల్ల ఈ హింసాత్మక సంఘటనలపై జ్యుడీషియల్‌ విచారణ జరగాలని కోరుతున్నామని చెప్పారు. ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ హింసాకాండలో బాధితులకు తగిన నష్టపరిహారం కూడా అందజేయాలని డిమాండ్‌ చేశారు. వక్ఫ్‌ (సవరణ) చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసినట్లు సలీం చెప్పారు. ‘ఇది రెండు మతాల మధ్య అంశం కాదు, ముస్లిం హక్కులకు సంబంధించిన విషయం, పార్లమెంట్‌ ఆమోదించిన కొత్త చట్టంతో వారి హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి.’ అని సలీం పేర్కొన్నారు.
ముర్షీదాబాద్‌ హింసాకాండలో తన కొడుకుతోపాటు మరణించిన హరగోవింద దాస్‌ సిపిఎం మాజీ సభ్యుడని, వృద్ధాప్యం కారణంగా ఆయన పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నారని సలీం చెప్పారు. మతం పేరుతో ప్రజలను చీల్చేందుకు బిజెపి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ముర్షీదాబాద్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు సైన్యాన్ని రప్పించాలని వామపక్ష సంఘటన డిమాండ్‌ చేసిందన్నారు. జిల్లాలోని కల్లోలిత ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు కలకత్తా హైకోర్టు ఆదేశాలపై కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఎపిఎఫ్‌) ముర్షీదాబాద్‌లో మోహరించాయి.

బెంగాల్‌లో హింసాకాండపై కోర్టు పర్యవేక్షణలో విచారణ
సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు

వక్ఫ్‌ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న హింసాకాండపై కోర్టు పర్యవేక్షలో విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఒక పిటిషన్‌ను న్యాయవాది శశాంక్‌ శేఖర్‌ దాఖలు చేశారు. హింసా కాండపై దర్యాప్తునకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌)ను కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. రెండో పిటిషన్‌ను న్యాయవాది విశాల్‌ తివారీ దాఖలు చేశారు. హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో జ్యూడిషియల్‌ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. పిటిషన్లలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని, హింసాకాండపై సుప్రీంకోర్టులో నివేదిక దాఖలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా విజ్ఞప్తి చేశారు. వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 11, 12 తేదీల్లో ముర్షీదాబాద్‌ జిల్లాలో జరిగిన హింసా కాండలో ముగ్గురు మరణించారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నెల 14న దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భంగర్‌ ప్రాంతంలోనూ అల్లర్లు జరిగాయి.

➡️