CPM: మతోన్మాద, కార్పొరేట్‌ శక్తులపై పోరు

సిపిఎం స్వతంత్ర బలం పెంపుదల -వామపక్ష ఐక్యత బలోపేతం
అఖిల భారత మహాసభలో రాజకీయ ఎత్తుగడల పంథాపై చర్చ : ప్రకాశ్‌ కరత్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం అనుసరించనున్న రాజకీయ ఎత్తుగడ పంథాను పార్టీ 24వ అఖిల భారత మహాసభలో నిర్ణయిస్తామని ఆ పార్టీ సమన్వయకర్త ప్రకాశ్‌ కరత్‌ పేర్కొన్నారు. కోల్‌కతాలో జరుగుతున్న సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సిపిఎం 24వ అఖిలభారత మహాసభలు తమిళనాడులోని మదురైలో ఏప్రిల్‌ 2 నుంచి 6 వరకు జరగనున్నాయని, ఇప్పటికే రాష్ట్రాల్లో మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. పార్టీ భవిష్యత్తు రాజకీయ ఎత్తుగడల పంథా (పిటిఎల్‌)ను పార్టీ మహాసభ నిర్ణయిస్తుందని వివరించారు. దేశంలో ప్రస్తుతం హిందూత్వ, కార్పొరేట్‌ శక్తుల ప్రతినిధిగా మోడీ సర్కార్‌ ఉందని తెలిపారు. గత పదేళ్లుగా దేశంలోని అధికారాన్ని, స్వతంత్ర సంస్థలను ఉపయోగించి తన ఎజెండాను అమలు చేస్తోందని విమర్శించారు. ఆ ఎజెండాలో హిందూరాష్ట్ర నిర్మాణానికి హిందూత్వాన్ని ముందుకు తీసుకురావడం, కార్పొరేట్‌ అనుకూల నయా ఉదారవాద విధానాల అమలు రెండు అంశాలని పేర్కొన్నారు. హిందూత్వ, కార్పొరేట్‌ బంధంతో మిళితమైన కేంద్ర సర్కార్‌కు వ్యతిరేకంగా ఎలా ఉద్యమించాలనేదానిపై పార్టీ అఖిల భారత మహాసభ ప్రధానంగా దృష్టి పెడుతుందని తెలిపారు. హిందూ మతోన్మాద, నయా ఉదారవాద విధానాలు రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, కనుక ఈ రెండింటికి వ్యతిరేకంగా ఏకకాలంలో ఉద్యమించాల్సి ఉందని పేర్కొన్నారు.
సిపిఎం స్వతంత్ర బలం పెంచుకోవడంపై పార్టీ మహాసభ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. సిపిఎం బలంగా లేకపోతే, హిందూ మతోన్మాద, కార్పొరేట్‌ శక్తులపై పోరాటం విజయవంతం కాదని పేర్కొన్నారు. అలాగే వామపక్షాల బలోపేతంపై మహాసభలో చర్చిస్తామన్నారు. గత కొన్నేళ్లుగా సిపిఎం, వామపక్షాలు బలోపేతం కావటం లేదని, కనుక తమ బలహీనతలను అధిగమించేందుకు పార్టీ మహాసభలో కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. శ్రామికవర్గ పోరాటం, వివిధ వర్గాల ప్రజల ఉద్యమాలపైన, అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వానికి వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై పార్టీ మహాసభ చర్చిస్తుందని తెలిపారు. అమెరికాలో ట్రంప్‌ వచ్చిన తరువాత సామ్రాజ్యవాద దాడి మరింత పెరుగుతోందని విమర్శించారు. ప్రపంచంలో పురోగతి సాధిస్తోన్న చైనా, అమెరికాకు సవాల్‌గా మారిందని, అందువల్ల చైనాను అమెరికా టార్గెట్‌ చేస్తోందన్నారు. పాలస్తీనా, గాజాపై దాడులు చేస్తోన్న ఇజ్రాయిల్‌కు అమెరికా సామ్రాజ్యవాదం ఎలా మద్దతుగా నిలుస్తోందో అందరికి తెలుసని అన్నారు. రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తోన్న ఉక్రెయిన్‌కు అమెరికా సహాయం చేస్తోందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మితవాద శక్తులకు వ్యతిరేకంగా బలమైన వామపక్ష ఉద్యమం ఐక్యంగా ముందుకు సాగుతోందని అన్నారు. అలాగే దేశంలోనూ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా వామపక్షాలు ఐక్యంగా ముందుకు సాగుతామన్నారు. వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెస్తామని తెలిపారు. ఇదే 24వ పార్టీ అఖిల భారత మహాసభ ప్రధానమైన అజెండా అని ప్రకాశ్‌ కరత్‌ తెలిపారు.

➡️