సిపిఎస్‌, యుపిఎస్‌ వద్దు…ఒపిఎస్‌ పునరుద్ధరించాలి

Nov 30,2024 02:05 #No CPS, #ops, #revamped, #UPS
  • ఎన్‌ఇపిని రద్దు చేయాలి
  • ఎస్‌టిఎఫ్‌ఐ మహా ధర్నాలో డిమాండ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సిపిఎస్‌), యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (యుపిఎస్‌) తమకు వద్దని, పాత పెన్షన్‌ స్కీమ్‌ (ఒపిఎస్‌)నే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా పాఠశాల ఉపాధ్యాయులు మరోమారు పోరుబాట పట్టారు. ఈ క్రమంలో స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టిఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మహా ధర్నా చేపట్టారు. సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్ధరించాల్సిందేనని ముక్తకంఠంతో నినదించారు. ఎన్‌పిఎస్‌, జిపిఎస్‌, యుపిఎస్‌, పిఎఫ్‌ఆర్‌డిఎ ఇవన్నీ ఉద్యోగులను తప్పుదారి పట్టించే పథకాలన్నీ, వీటితో భరోసా దక్కదని తెలిపారు. దేశ విద్యా రంగాన్ని నాశనం చేసే నూతన జాతీయ విద్యా విధానం- 2020ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. తాత్కాలిక, అడహాక్‌, కాంట్రాక్ట్‌, టెర్మ్‌ బేసిస్‌ టీచర్లను, ఉద్యోగులను రైగ్యులర్‌ చేయాలని కోరారు. శాశ్వత ప్రాతిపదికన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఖాళీలను భర్తీ చేయాలని, విద్యా హక్కు చట్టాన్ని 12వ తరగతి వరకు పొడిగించాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల కుదింపు, విలీనం వంటి చర్యలను నిలుపుదల చేయాలని, ప్రాథమిక, ప్రాధమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎస్‌టిఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెసి హరికృష్ణన్‌, సిఎన్‌ భార్తి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పాఠశాలల మూసివేతను ఆపాలని డిమాండ్‌ చేశారు. దేశంలో పేదలకు నాణ్యమైన విద్యను దూరం చేసి, కార్పొరేట్లకు లాభాలను అందించే జాతీయ విద్యా విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌టిఎఫ్‌ఐ ఉపాధ్యక్షులు, టిఎస్‌యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ చందాతో కూడిన పింఛను పథకం (సిపిఎస్‌) రద్దు చేయాలని, ఇరవై ఏళ్ళుగా చేస్తున్న పోరాటానికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం యుపిఎస్‌ ప్రతిపాదించిందని అన్నారు. అయితే పాత ఒపిఎస్‌ పునరుద్ధరించడం మినహా మరే పథకాన్ని అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

వామపక్ష ఎంపిలు సంఘీభావం

ఉపాధ్యాయుల ధర్నాకు సిపిఎం రాజ్యసభ సభ్యులు శివదాసన్‌, సిపిఐ (ఎంఎల్‌) లోక్‌సభ ఎంపిలు సుధామ ప్రసాద్‌, రాజారాం సింగ్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్‌ఇపి కార్పొరేట్ల కోసం మాత్రమే తీసుకొచ్చారని, దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను ఉపాధ్యాయులు వ్యతిరేకించాలని కోరారు. ఈ ధర్నాలో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఎఐఎస్‌జిఇఎఫ్‌) అధ్యక్షులు సుభాష్‌ లాంబ, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.పి సాను, మయూఖ్‌ బిశ్వాస్‌, విద్యావేత్తలు మధుప్రసాద్‌, నందితా నారాయణ్‌ తదితరులు ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం నుండి టిఎస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, రాష్ట్ర కార్యదర్శి నాగమణి, రాష్ట్ర కమిటీ సభ్యులు బక్కా శ్రీనివాస చారి, సృజన్‌ కుమార్‌, ఎల్లయ్య, కిరణ్‌ కుమార్‌, టి కుమార్‌, రమేష్‌, శ్రీనివాసరెడ్డి, చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

➡️