సౌండ్‌ ఎక్కువ పెట్టారని సంభాల్‌ ఇమామ్‌పై క్రిమినల్‌ కేసు

  • మసీదు నుంచి లౌడ్‌ స్పీకర్‌ తొలగింపు

న్యూఢిల్లీ : ‘అజాన్‌’ సమయంలో నిర్దేశించిన పరిమితి కన్నా సౌండ్‌ ఎక్కువగా పెట్టారని ఆరోపిస్తూ సంభాల్‌లోని ఒక మసీదు ఇమామ్‌పై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. మసీదు నుంచి లౌడ్‌ స్పీకర్‌ను తొలగించి, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంభాల్‌లోని చాందౌసి ప్రాంతంలోని ఒక మసీదు ఇమామ్‌ హఫీజ్‌ షకీల్‌ షంసీపై ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం వంటి అభియోగాలతో క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. మసీదు సమీప ప్రాంతంలో నివసించే వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాకుండా, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం గమనార్హం. కానిస్టేబుల్‌ జితేంద్ర కుమార్‌ తాను పెట్రోలింగ్‌లో ఉన్న సమయంలో మసీదు నుంచి పరిమితికి మించి శబ్ధం వస్తున్న విషయాన్ని గుర్తించానని ఫిర్యాదులో తెలిపాడు. రంజాన్‌ ఉపవాసం చేస్తున్న ముస్లింలు హోలీ రోజున రంగులు చల్లుకోవడానికి ఇష్టపడకపోతే వారంతా ఇంట్లోనే ఉండాలని ఒక సీనియర్‌ పోలీస్‌ అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ కేసు నమోదు కావడం గమనార్హం. కాగా, ఇలాంటి ఆరోపణలతో ఇమామ్‌లపై కేసులు నమోదు చేయడం ఉత్తరప్రదేశ్‌ పోలీసులకు ఇదే మొదటిసారి కాదు. పరిమితికి మించి సౌండ్‌ పెడుతున్నారని జనవరి 17లో ఇద్దరు ఇమామ్‌లపై కేసు నమోదు చేశారు.

➡️