- కంగుతిన్న ఐటి అధికారులు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఒక బిజెపి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలకు వెళ్లిన ఐటి అధికారులు అక్కడ మూడు మొసళ్లను చూసి కంగుతిన్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ మాజీ ఎమ్మెల్యే హర్వాన్ష్ సింగ్ రాథోడ్ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. రాథోడ్ తండ్రి హర్నామ్ సింగ్ రాథోడ్ మధ్యప్రదేశ్ మంత్రిగా పనిచేశారు. పన్ను ఎగవేతపై రాథోడ్ ఇంట్లో ఐటి అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో రాథోడ్ ఇంట్లోని చెరువులో మూడు మొసళ్లు కనిపించాయి. కాగా, రాథోడ్‌తో పాటు మాజీ కౌన్సిలర్ రాజేశ్ కేశర్వాణి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. రాథోడ్ రూ.155 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఆయన ఇంట్లో రూ.3 కోట్ల నగదుతో పాటు కోట్లు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. కేశర్వాణి రూ.140 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన పత్రాలను అధికారులు రాథోడ్ ఇంట్లో గుర్తించారు. బీడీల వ్యాపారంలో వీరిరువురూ భాగస్వాములని తేలింది.