ఇంఫాల్ : మణిపూర్‌లో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని, భద్రతా అధికారులు తెలిపారు. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 11 మంది సాయుధ గ్రూపు సభ్యులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత, ఇంఫాల్‌లోయలో పలు ప్రాంతాల్లో హింసాకాండ చెలరేగిందని, ఇరు వర్గాలకు చెందిన సాయుధ సమూహాలు ఎదురు కాల్పులకు పాల్పడ్డాయని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఇంఫాల్ పశ్చిమ, ఇంఫాల్ తూర్పు జిల్లాల్లో వివిధ గ్రామాల నుండి హింసాత్మక ఘర్షణలు నమోదయ్యాయని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిషేధాజ్ఞలు విధించినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. అదే సమయంలో తప్పిపోయిన వ్యక్తుల జాడ కోసం ఆపరేషన్ ప్రారంభించినట్లు పేర్కొంది. ఎన్‌కౌటర్‌లో మరణించినవారంతా కుకీ తెగకు చెందినవారని స్థానిక మీడియా వెల్లడించింది. కుకీల హత్యకు నిరసనగా కొండిపాంతాల్లోని ఆ తెగ మెజారిటీగా ఉండే ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 5.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు బంద్‌కు పిలుపునిచ్చింది.