చెన్నై : ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా…. చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల నేపథ్యంలో … శనివారం సాయంత్రం 5 గంటల వరకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే శుక్రవారం నుంచి విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పలు ఎయిర్‌లైన్లు ప్రకటించాయి. కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. తాజాగా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను ఆపడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం సాయంత్రం నాటికి ఈ తుపాను తీరం దాటుతూ ఉధృతంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. తుపానును ఎదుర్కొనేందుకు సంసిద్ధత చర్యలను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అటు పుదుచ్చేరిలోనూ భారీ వర్షాల కారణంగా సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. అక్కడి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం సూచించింది.