న్యూఢిల్లీ : అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం తుపానుగా మారింది. దీనికి ‘అస్నా’గా పేరు పెట్టారు. కచ్చా తీర ప్రాంతంలో, పాకిస్తాన్ సమీప ప్రాంతాల్లో ఇది ఉధృత రూపం దాల్చిందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) తెలిపింది. 1976 తర్వాత ఆగస్టు మాసంలో అరేబియా సముద్రంలో ఏర్పడిన మొదటి తుపాను ఇదే. 1891 నుండి 2023 మధ్య అరేబియా సముద్రంలో ఆగస్టు మాసంలో కేవలం మూడు తుపానులు మాత్రమే ఏర్పడ్డాయి. అవి 1944, 1964, 1976ల్లో సంభవించాయని ఐఎండి తెలిపింది. కచ్చా తీరంలో, పాకిస్తాన్ సమీప ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం గత ఆరుగంటలుగా గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా ముందుకు కదులుతోంది. మధ్యాహ్నం 11.30గంటలకు గుజరాత్‌లోని భుజ్‌కు పశ్చిమ-వాయవ్యంగా 190కిలోమీటర దూరంలో కేంద్రీకృతమైందని ఐఎండి తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో భారత తీర ప్రాంతానికి దూరంగా, ఈశాన్య అరేబియా సముద్రంలో పశ్చిమ-వాయవ్య దిశగా ఇది కదులుతుందని వాతావరణ విభాగం తెలిపింది. అల్పపీడన పరిస్థితుల కారణంగా గుజరాత్‌లో గత నాలుగు రోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 26మంది మరణించిన సంగతి తెలిసిందే.
