మిడ్నాపూర్ : గడువు ముగిసిన సెలైన్ వల్ల గురువారం ఎనిమిది రోజుల నవజాత శిశువు మృతి చెందింది. ఈ ఘటన కోల్‌కతాలోని మిడ్నాపూర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చోటు చేసుకుంది. జనవరి 8వ తేదీన మంపి సింగ్ (23), నస్రీన్ ఖాతున్ (19), మినారా బీబీ (31), రేఖా సౌ (23) మమోని రుయిడాస్‌లు ప్రసవం కోసం మిడ్నాపూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరారు. అయితే వారిలో రుయిడాస్‌కి రెండోరోజుల తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మృతి చెందారు. మంపి సింగ్, నస్రీన్ ఖాతూన్, మినారాలకు కూడా ఆరోగ్యం క్షీణించింది. వీరిని వెంటనే చికిత్స కోసం కలకత్తాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రికి తరలించారు. అయితే గురువారం రేఖా సౌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఆమెకు పుట్టిన బిడ్డ చనిపోయింది. రుయిడాస్ చనిపోయినా ఆమె బిడ్డ ఆరోగ్యం బాగానే ఉంది. ఆమె బిడ్డను గత మంగళవారం ఆసుపత్రిలో చేర్పించారు. మరుసటిరోజు బుధవారం మధ్యాహ్నం ఆ నవజాత శిశువును డిశ్చార్జ్ చేశారు. అయితే రేఖా సౌ ఆరోగ్యం బాగున్నప్పటికీ పుట్టిన తర్వాత తన బిడ్డ ఎనిమిదిరోజులకే చనిపోయింది.
కాగా, సిఐడి విచారణ జరుగుతున్నప్పటికీ తమ బిడ్డ చనిపోయింది. ఆసుపత్రిలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఈ ఘటనపై సిఐడి చేత విచారణ జరిపించాలని చనిపోయిన బిడ్డ తండ్రి డిమాండ్ చేశారు. రుయిడాస్ మరణం పట్ల వారి కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గడువు ముగిసిన సెలైన్‌ను ఆమెకి ఎక్కించడం వల్లే రుయిడా మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి 13 మంది సభ్యుల బృందాన్ని ఆసుపత్రికి పంపి సమాచారాన్ని సేకరించింది. దీంతో చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ ఈ ఘటనపై సిఐడి విచారణకు ఆదేశించారు.
పశ్చిమ బంగా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ కంపెనీ ద్వారా సరఫరా అయిన కాంపౌండ్ సోడియం లాక్టేట్ ఇంజెక్షన్ (ఆర్‌ఎల్) యొక్క ప్రస్తుత స్టాక్‌ను పూర్తిగా నిలిపివేసేందుకు ఆరోగ్యశాఖ అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలకు, ఆసుపత్రుల మెడికల్ సూపరింటెండెంట్లు, వైస్ ప్రిన్సిపాల్స్, చీఫ్ మెడికల్ ఆఫీసర్లను ఆదేశించింది. అలాగే అన్ని ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో కూడా ఈ కంపెనీ సరఫరా చేసిన మందుల నిల్వలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది.
