అస్సాంలో విద్యార్థి మృతి- పలువురికి తీవ్రగాయాలు

May 29,2024 08:58 #Raymal storm

డిస్‌పూర్‌, గౌహతి : రేమాల్‌ తుపాను ప్రభావంతో అస్సాంలో మంగళవారం ఒక వ్యక్తి మృతి చెందగా, అనేకమంది గాయపడ్డారు. రాష్ట్రంలో మంగళవారం బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. మోరిగావ్‌ జిల్లాలో దిఘల్‌బోరి వద్ద రోడ్డుపై ప్రయాణిస్తున్న ఆటోపై చెట్టు పడిపోవడంతో 17 ఏళ్ల కాలేజి విద్యార్థి కౌసిక్‌ బోర్డోలోరు అంఫీ ప్రాణాలు కోల్పోయాడు. ఆటోలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోనిత్‌పూర్‌ జిల్లాలో ధేకియాజులిలో స్కూల్‌ బస్సుపై చెట్టుపడిపోవడంతో అందులో ఉన్న 12 మంది చిన్నారులు గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. రాజధాని డిస్‌పూర్‌, గౌహతి పట్టణాలతో సహా అస్సాం వ్యాప్తంగా పలుచోట్ల చెట్లు నేలకూలినట్లు అధికారులు తెలిపారు. దిగువ అస్సాంలో విద్యుత్‌ స్థంభాలు పడిపోవడతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, వివిధ ప్రాంతాల్లో నీరు నిలిచిందని అధికారులు చెప్పారు. కామరూప్‌ (మెట్రో), ధుబ్రి, గోల్‌పరా, కామ్‌రూప్‌, మోరిగావ్‌, నాగావ్‌, సోనిత్‌పూర్‌, డిమా హసావో జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని తెలిపారు. అనేక రోడ్డు మార్గాలను మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ మోరిగావ్‌, నాగావ్‌, డిమా హసావో జిల్లాల్లో పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలు మూసివేశారు. ఫెర్రీ సర్వీసులు రద్దు చేయడంతో అనేక బోట్లు, ఫెర్రీలు బ్రహ్మపుత్ర నదీ ఒడ్డున నిలిచిపోయాయి. గౌహతి, జోర్హాట్‌, తేజ్‌పూర్‌, మోరిగావ్‌, ధుబ్రి, గోల్‌పరా, దక్షిణ సల్మారా, బార్‌పేట్‌, కాచర్‌, కరీంగంజ్‌ జిల్లాల్లో ఫెర్రీ సర్వీసులు నిలిచిపోయాయి. ‘పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దు’ అని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ విజ్ఞప్తి చేశారు. పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

➡️