గవర్నర్లు పంపిన బిల్లులపై మూడు నెలల్లోగా నిర్ణయం

  • రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు
  • వ్యక్తిగత అసంతృప్తులతో బిల్లులను ఆపలేరని స్పష్టీకరణ

న్యూఢిల్లీ : గవర్నర్లు తనకు పంపిన రాష్ట్ర ప్రభుత్వ బిల్లులను ఆమోదించాలా? వద్దా? అని నిర్ణయించుకోవడానికి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కాలపరిమితి విధించింది. రాష్ట్రపతి పరిశీలన నిమిత్తం గవర్నర్‌ బిల్లులను నివేదించిన రోజు నుండి మూడు నెలల్లోగా వాటిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. ఇలా అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రపతికి గడువు విధించడం ఇదే తొలిసారి. ఈ గడువు మీరి జాప్యం జరిగిన పక్షంలో రాష్ట్రపతి సరైన కారణాలను నమోదు చేయాల్సి వుంటుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి వుంటుందని ఈ నెల 8న సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ బిల్లులపై కేంద్రం నుండి ఏవైనా సూచనలు లేదా ప్రశ్నలు వస్తే రాష్ట్రాలు సహకార స్ఫూర్తితో వ్యవహరించాలని పేర్కొంది.
రాజ్యాంగ విరుద్ధమన్న కారణాలతో గవర్నర్‌, రాష్ట్రపతి పరిశీలన నిమిత్తం తన వద్దే అట్టిపెట్టుకున్న బిల్లులపై వివేచనతో వ్యవహరించి రాష్ట్రపతి, సుప్రీంకోర్టు సలహాను తీసుకోవాలని జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన బెంచ్‌ పేర్కొంది.
ఈ మేరకు జస్టిస్‌ పార్దివాలా 414 పేజీల తీర్పును రాశారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు (ఏప్రిల్‌ 12) ఈ తీర్పును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. గవర్నర్‌ తనకు నివేదించిన బిల్లులపై రాష్ట్రపతి, సుప్రీంను సంప్రదించాల్సిన అవసరం వుందని, ఎందుకంటే రాష్ట్రస్థాయిలో గవర్నర్లకు బిల్లులను రాజ్యాంగ న్యాయస్థానాలకు సలహా లేదా అభిప్రాయం కోసం నివేదించేందుకు ఎలాంటి యంత్రాంగం లేదని పేర్కొన్నారు.
తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను విచారించిన సుప్రీం తన తీర్పులో కీలకమైన వ్యాఖ్యలు చేసింది. నెలల తరబడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తొక్కిపట్టి వుంచడం చట్టపరంగా తప్పు అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా పొరుగు దేశమైన శ్రీలంకలో నెలకొన్న పరిణామాల గురించి జస్టిస్‌ పార్దివాలా ప్రస్తావించారు. శ్రీలంకలో అధ్యక్షుడు బిల్లులపై అభిప్రాయం కోసం సుప్రీంకోర్టుకు నివేదిస్తారని పేర్కొన్నారు. ప్రావిన్షియల్‌ కౌన్సిల్‌ చేసిన బిల్లు రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్‌ భావించినట్లైతే ఆయన ఆ బిల్లును అధ్యక్షుడికి నివేదించవచ్చని, ఆయన అవసరమనుకుంటే దాన్ని శ్రీలంక సుప్రీం కోర్టుకు నివేదించవచ్చని తెలిపారు. అటువంటి బిల్లుకు సంబంధించి రాజ్యాంగపరమైన అంశాలను తెలుసుకోవడానికి ఈ చర్య తప్పనిసరని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఆ బిల్లు రాజ్యాంగబద్ధమైనదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తే ఇక గవర్నర్‌ సమ్మతిని తెలియజేయాల్సిందేనని జస్టిస్‌ పార్దివాలా వివరించారు.
బిల్లు చట్టంగా మారడానికి ముందుగా ఆ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటుపై సూచనలు లేదా సలహాలు ఇవ్వకుండా రాజ్యాంగ న్యాయస్థానాలను నిలువరించలేం. ప్రతిపాదిత చట్టం గురించి న్యాయ సమీక్ష చేయడం వల్ల అటు ప్రజా వనరులు ఇటు సమయం రెండూ ఆదా అవుతాయి. పైగా అవసరమనుకుంటే సముచితమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి గానూ బిల్లును సమీక్షించేందుకు శాసనసభకు రెండో అవకాశం కూడా వస్తుంది.

వ్యక్తిగత అసంతృప్తులతో రాష్ట్రపతి పరిశీలనకు పంపలేరు

వ్యక్తిగతంగా తనకు అసంతృప్తిగా వుందన్న కారణంతో గవర్నర్‌, తన వద్దకు వచ్చిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య సాంప్రదాయాలు, సూత్రాలు, నిబంధనలకు పెద్ద ముప్పు వస్తుందని భావిస్తేనే కేవలం ఆ కారణాలతోనే బిల్లును రాష్ట్రపతికి నివేదించాల్సి వుంటుందని సుప్రీం పేర్కొంది. అలా నివేదించడానికి గల స్పష్టమైన కారణాలను కూడా వెల్లడించాలని తెలిపింది.

➡️