ఢిల్లీ వాయుకాలుష్యంపై కాప్‌ 29 సదస్సులో చర్చించాలి

Nov 19,2024 15:48 #air polution, #COP-29, #Delhi

బాకు : ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 11 నుండి 22 వరకు బాకులో జరుగుతున్న కాప్‌ 29 సదస్సులో ఢిల్లీ గాలి కాలుష్యంపై చర్చించాల్సిన కీలకాంశంగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో ఏర్పడుతున్న గాలి కాలుష్యంపై నిపుణులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గాలి కాలుష్యం వల్ల తలెత్తే ఆరోగ్య ప్రమాదాల గురించి వారు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఈ కాలుష్య నివారణకు ప్రపంచ దేశాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
కాగా, ఢిల్లీ గాలి కాలుష్యంపై వాతావరణ ట్రెండ్స్‌ డైరెక్టర్‌ ఆర్తీ ఖోస్లా మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో ఎక్యూఐ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో క్యూబిక్‌ మీటర్‌కు 1,000 మైక్రోగ్రాముల (నలుసు) కంటే ఎక్కువ కాలుష్యం నమోదైంది. ప్రధానంగా బ్లాక్‌ కార్బన్‌, ఓజోన్‌, మండుతున్న శిలాజ ఇంధనాలు, పంట వ్యర్థాల దగ్ధం వంటి నుండి కాలుష్యం ఏర్పడుతుంది. ఈ కాలుష్యాన్ని నివారించే పరిష్కారాలు ప్రస్తుతం మనకు అవసరం’ అని ఆమె అన్నారు. లానినా (వాయు తరంగాలు) వాతావరణ నమూనాలో శీతాకాలంలో గాలివేగం తక్కువగా ఉండడంతో.. గాలి కాలుష్యానికయ్యే కారకాలను బంధిస్తుంది. దీంతో గాలికాలుష్యం తీవ్రస్థాయిలో ఏర్పడి.. అధ్వాన్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా ప్రపంచ వాతావరణ సమస్యలపై చర్చించే సమయంలో లక్షలాది ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కూడా చర్చించాలి. అలాగే చేపట్టాల్సిన తక్షణ చర్యలపై చర్చించాలని ఆమె అన్నారు. ఈ సందర్బంగా ఆమె వాతావరణ విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రపంచ ధనిక దేశాలు… అభివృద్ధి చెందుతున్న దేశాలకు, పేద దేశాలకు ఆర్థిక సహాయం చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు.
గ్లోబల్‌ క్లైమేట్‌ వైస్‌ ఛైర్‌ పర్సన్‌ కోర్ట్ని హోవార్డ్‌ కాలుష్యంపై మాట్లాడుతూ.. ‘ఆరోగ్య సంరక్షణకు నిధులు కేటాయించడం లేదు. భారీ లాభాలు ఆర్జించే కార్పొరేషన్లకు ఒక ట్రిలియన్‌ డాలర్లు చొప్పున ఇస్తున్నాం. కానీ ఆరోగ్య సంరక్షణ కోసం మాత్రం డబ్బు లేదని చెబుతున్నాం. ప్రతి ఒక్కరిని రక్షించడానికి, ఆరోగ్యానికి మేము నిధులు సమకూర్చాల్సి ఉంది’ అని ఆమె అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే నగరాల్లోని పిల్లల ఊపిరితిత్తుల సామర్థ్యం 40 శాతం తక్కువగా ఉంది. మనం పీల్చే గాలి ఇందుకు ప్రధానకారణం. అదే మన పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తోంది అని బ్రిత్‌ మంగోలియా సహ వ్యవస్థపకుడు ఎంఖున్‌న బైంబాడోర్జ్‌ అన్నారు.

➡️