అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ

Mar 12,2025 07:14 #Delhi air pollution
  • కాలుష్య నగరంగా బైర్నిహట్‌
  • టాప్‌ 20 నగరాల్లో 13 భారత్‌లోనే

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంగా వున్న టాప్‌ 20 నగరాల్లో 13 నగరాలు భారత్‌లోనే వున్నాయి. వీటిల్లో మేఘాలయలోని బైర్నిహట్‌ నగరం ప్రపంచలోనే ప్రధమ స్థానంలో వుందని మంగళవారం ప్రచురితమైన కొత్త నివేదిక పేర్కొంది. కాలుష్య రాజధాని నగరాల్లో ఢిల్లీ తన మొదటిస్థానాన్ని కొనసాగిస్తోంది. ప్రపంచ నగరాల్లోని వాయు నాణ్యతపై స్విస్‌ ఎయిర్‌ టెక్నాలజీ కంపెనీ ఐక్యు ఎయిర్‌ 2024 సంవత్సరానికి వెలువరించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన దేశంగా భారత్‌ 2023లో మూడో స్థానంలో వుండగా, 2024లో ఐదవ స్థానంలోకి వచ్చింది.కొంత మెరుగుదల ఉన్నప్పటికీ ఇంకా చేయవలిసింది ఎంతో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీని దాటి బైర్నిహట్‌ మొదటి స్థానంలో చేరడానికి అక్కడ ఉన్న పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం ్పధాన కారణం. ప్రపంచంలోని టాప్‌ 20నగరాల్లో పొరుగునున్న పాకిస్తాన్‌లో నాలుగు నగరాలుండగా, చైనాలో ఒకటి వుంది. క్యూబిక్‌ మీటర్‌కు 50.6 మైక్రోగ్రాములు చొప్పున గతేడాది భారత్‌లో పిఎం 2.5 కాన్‌సెంట్రేషన్‌ల్లో ఏడు శాతం క్షీణత నమోదైంది. 2023లో ఇది 54.4 మైక్రోగ్రామ్స్‌గా వుంది. గాలి నాణ్యత ఢిల్లీలో చాలా అధ్వాన్న స్థితికి చేరుకుంది. 2023లో క్యూబిక్‌ మీటర్‌ గాలిలో 102.4 మైక్రో గ్రాములుండగా, 2024కి వచ్చేసరికి అది 108.3కి చేరుకుంది. భారత్‌లోని అత్యంత కలుషితమైన నగరాల్లో బైర్నిహట్‌, ఢిల్లీ, పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్‌, ఫరిదీబాద్‌, లోని, గురుగ్రామ్‌, గంగానగర్‌, గ్రేటర్‌నొయిడా, భివాండి, ముజఫర్‌నగర్‌, హనుమాన్‌ఘడ్‌, నొయిడాలు వున్నాయి. డబ్ల్యుహెచ్‌ఓ పరిమితి విధించిన కాలుష్యం కన్నా 10రెట్లు అధికంగా వున్న నగరాలు భారత్‌లో 35శాతం వున్నాయని నివేదిక పేర్కొంది.

➡️