- 8న ఓట్ల లెక్కింపు
- ఎన్నికల షెడ్యూల్ విడుదల
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : డెబ్బయి స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి5న ఎన్నికలు జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ సంధు లతో కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం నాడిక్కడ విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలజేశారు. దీని ప్రకారం ఈ నెల 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ వేసేందుకు తుది గడువు జనవరి17, నామినేషన్ల పరిశీలన జనవరి 18. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు జనవరి20.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరు క్షణం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ పదవీ కాలం వచ్చే నెల 23తో ముగియనుంది. మొత్తం 70 స్థానాల్లో జనరల్ సీట్లు 58 ఉండగా, ఎస్సీ రిజర్వ్‌డ్ 12 సీట్లు ఉన్నాయి. 2015, 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా 67, 62 సీట్లతో ఘన విజయం సాధించింది.ఢిల్లీలో మొత్తం ఓటర్లు 1.55 కోట్లు. వీరిలో పురుష ఓటర్లు 83.49 లక్షలు, మహిళా ఓటర్లు 71.74 లక్షలు ఉన్నారు. మహిళా సిబ్బంది నిర్వహించే పోలింగ్ కేేంద్రాలు 70, మోడల్ పోలింగ్ కేంద్రాలు 210 ఉన్నాయి.
ఇవిఎంల ట్యాంపరింగ్ ఛాన్సే లేదు
త్వరలో 100 కోట్లకు చేరనున్న ఓటర్లు : సిఇసి
ఈవిఎంల ట్యాంపరింగ్‌కు అవకాశమే లేదని రాజీవ్ కుమార్ తేల్చి చెప్పారు. సాయంత్రం 5 తరువాత పోలింగ్ సరళిలో భారీ పెరుగుదల ఉంటోందని వస్తోన్న ఆరోపణలు సరికాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ శాతాన్ని ఎవరూ మార్చలేరన్నారు. ఇక ఈవిఎంలను హ్యాక్ చేసేందుకు అవకాశమే లేదన్నారు. ఇదే విషయాన్ని న్యాయస్థానాలు 42 సార్లు తమ తీర్పుల్లో చెప్పాయన్నారు. త్వరలోనే దేశంలో ఓటర్ల సంఖ్య 100 కోట్లకు చేరనుందన్నారు.