నేడు ఢిల్లీ ఎన్నికలు

Feb 5,2025 06:14 #Delhi elections, #today
  • అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • బిజెపిపై ఇసికి కేజ్రీవాల్‌ బృందం ఫిర్యాదు
  • అతిషిపై కేసు నమోదు

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. బుధవారం 70 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా పటిష్టంగా భద్రతా ఏర్పాటు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిల్కిపూర్‌ (ఉత్తరప్రదేశ్‌), ఈరోడ్‌ (తూర్పు) (తమిళనాడు) అసెంబ్లీ స్థానాలకు కూడా బుధవారం ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నెల 8న వీటి ఫలితాలు వెల్లడించనున్నారు.

ఓటర్లపై దాడి చేసి, వేళ్లపై సిరా పోస్తున్నారు : బిజెపిపై ఇసికి కేజ్రీవాల్‌ ఫిర్యాదు

ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఓటర్లపై బిజెపి గూండాలు దాడులకు, బెదిరింపులకు దిగుతున్నారని కేజ్రీవాల్‌ విమర్శించారు. బిజెపిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ అధికారులను కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ బృందం విజ్ఞప్తి చేసింది. ఇసి అధికారులతో సమావేశం తరువాత మీడియా ప్రతినిధులతో కేజ్రీవాల్‌ మాట్లాడారు. ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో సోమవారం రాత్రి బిజెపి గూండాలు దాడికి పాల్పడ్డారని విమర్శించారు. ప్రజలపై దాడి చేసి, బలవంతంగా వేళ్లపై సిరా వేస్తున్నారని, బుధవారం ఓటింగ్‌కు రావొద్దని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నీ ఇసి దగ్గర లేవనెత్తినట్లు తెలిపారు. కఠినమైన చర్యలు తీసుకుంటామని, నిష్పాక్షికంగా ఎన్నికలు జరుగుతాయని ఇసి హామీ ఇచ్చినట్లు కేజ్రీవాల్‌ తెలిపారు.

నిష్పాక్షికంగా పనిచేస్తాం : ఇసి

ఆప్‌ బృందంతో భేటీ తరువాత ఇసి ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల అధికారులందరూ నిష్పాక్షికంగా పని చేస్తారని, అందరికీ సమాన అవకాశాలను దెబ్బతీసే ఏ పక్షపాత ప్రవర్తనను క్షమించబోమని ఇసి ఎక్స్‌లో పోస్టు చేసింది. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని, రాత్రంతా సరిహద్దు ప్రాంతాల్లో కఠినమైన నిఘా ఉంచాలనిపోలీసు, ఎన్నికల పరిశీలనా అధికారులను ఆదేశించింది. ప్రలోభాలు, బెదిరింపు ఘటనలకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఓడిపోతామనే ఆప్‌ ఫిర్యాదులు

బిజెపి ఎంపి హర్ష మల్హోత్రా స్పందిస్తూ… ఆప్‌ ఆరోపణలన్నీ నిరాధారమని తెలిపారు. ‘ఆప్‌ నాయకులు మేం (బిజెపి) ఇవిఎంలను ట్యాంపరింగ్‌ చేశామని నిందించడం కూడా ఆరంభిస్తారు. ఓటమి భయంతోనే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు.’ అని అన్నారు.

అతిషిపై ఢిల్లీ పోలీసుల కేసు

ఢిల్లీ ముఖ్యమంత్రి, కల్కాజీ నియోజకవర్గ ఆప్‌ అభ్యర్థి అతిషిపై ఢిల్లీ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తాన నియమావళి (ఎంసిసి)ను ఉల్లంఘించారని, విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకున్నారనే అభియోగాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు పోలీసు అధికారులు తెలిపారు.

➡️