Delhi: ప్రభుత్వ వ్యతిరేకత వల్లే…

Feb 9,2025 22:31 #CPIM, #Delhi election results

ఆప్‌ ఓటమిపై సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కమిటీ
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ ఓటమికి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తే కారణమని సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఆప్‌ ఓటింగ్‌ 10 శాతం తగ్గిపోవడం, పలువురు ముఖ్య నాయకులు ఓడిపోవడం ప్రజల వ్యతిరేకతను తెలుపుతోందని పేర్కొంది. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలం కావడం, అవినీతిలో కూరుకుపోయిందంటూ బిజెపి విస్తృతంగా చేసిన ప్రచారాన్ని ఎదుర్కోలేకపోవడం ఓటమికి కారణాలని తెలిపింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా ఆప్‌ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను కేంద్రప్రభుత్వం అడ్డుకుందని విమర్శించింది. పార్లమెంట్‌లో తనకున్న మెజారిటీని ఉపయోగించి చట్టాన్ని సవరించడం ద్వారా ఢిల్లీలో పరిపాలనను కేంద్రం గత మూడేళ్లుగా మరింతగా నియంత్రించిందని పేర్కొంది. ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య అవగాహన లేకపోవడం వల్ల డజనకుపైగా సీట్లను చాలా తక్కువ తేడాతో బిజెపి గెలుచుకుందని తెలిపింది. కాంగ్రెస్‌ ప్రచారం బిజెపికంటే ఎక్కువగా ఆప్‌కు వ్యతిరేకంగా సాగిందని, అది కమలం పార్టీకి సహాయపడిందని వివరించింది. సంఫ్‌ుపరివార్‌లోని వివిధ సంస్థలు అట్టడుగుస్థాయిలో మతం ఆధారంగా ప్రజల మధ్య విభజన తీసుకొచ్చేందుకు విస్తృతంగా ప్రచారం చేశాయని పేర్కొంది. భారీ మొత్తంలో డబ్బు బిజెపి బహిరంగంగానే పంపిణీ చేసిందని, సమాచారం ఇచ్చినా నియంత్రించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని విమర్శించింది. ఈ ఫలితం ఢిల్లీలో లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లను స్పష్టం చేసిందని సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కమిటీ పేర్కొంది.

➡️