Delhi polls : బిజెపిని ఎలా ఢ కొట్టాలనేది ఆప్‌, కాంగ్రెస్‌లే నిర్ణయించుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా

శ్రీనగర్‌ : దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్నిరోజులుగా ఇండియా బ్లాక్‌లో మిత్ర పక్ష పార్టీలుగా ఉన్న ఆప్‌, కాంగ్రెస్‌లు..అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం శత్రువులుగా మారాయి. ఈ పార్టీ నేతలు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నారు. ఈ ఇరు పార్టీల నేతల విమర్శలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. హాట్‌ టాపిక్‌గానూ మారాయి. ఈ నేపథ్యంలో బిజెపితో తలపడాలంటే.. కచ్చితంగా ఆప్‌, కాంగ్రెస్‌లు మెరుగ్గా పోరాడాల్సి ఉందని జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌ కాంగ్రెస్‌ కంటే.. ఆప్‌కే ఎక్కువ మద్దతు ఇస్తుందా? అని గురువారం మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. ‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో మాకు సంబంధం లేదు. దానిపై నేను మాట్లాడను. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఢకొీట్టాలంటే.. ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలతోపాటు ఇతర పార్టీలు ఎలా మెరుగ్గా పోరాడాలో నిర్ణయించుకోవాలి’ అని ఆయన జవాబిచ్చారు.
కాగా, లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌, ఎస్‌పి, ఎన్‌సిపి, యుబిటి, ఆప్‌, సిపిఐ(ఎం), సిపిఐ, జెఎంఎం, డిఎంకెతోపాటు పలు పార్టీలు ఇండియా బ్లాక్‌లో భాగమయ్యాయి. ఇటీవల జరిగిన జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌, సిపిఐ(ఎం), ఇతర పార్టీలు కలిసి పోటీ చేసి విజయం సాధించాయి.

➡️