సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
గవర్నర్లకు రాష్ట్రపతి ఉద్బోధ
రెండు రోజుల సదస్సు ప్రారంభం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రజాస్వామ్యం సజావుగా సాగడం చాలా కీలకమని, అందుకు గవర్నర్లు సమన్వయంతో పని చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్బోధించారు.. గత దశాబ్దంలో జరిగిన సామాజిక సంక్షేమ పథకాలు, న అభివృద్ధి గురించి ప్రజలకు అవగాహన కల్పించే రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. శుక్రవారం నాడిక్కడ రాష్ట్రపతి భవన్‌లో రెండు రోజుల గవర్నర్ల సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా సామాన్య ప్రజల సంక్షేమ పథకాలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్న అనేక అంశాలను ఈ సదస్సు చర్చించారు. జాతీయ విద్యా విధానంలో విద్యాసంస్థల అక్రిడిటేషన్, అసెస్‌మెంట్ వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ల హౌదాలో గవర్నర్లు ఈ సంస్కరణ ప్రక్రియకు సహకరించాలని ఆమె కోరారు. నేర న్యాయానికి సంబంధించి ఎలాంటి చర్చ లేకుండా కేంద్ర ప్రభుత్వం అమలులో పెట్టిన మూడు కొత్త చట్టాలను ఆమె ప్రశంసించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో భూసారాన్ని పెంచి రైతుల ఆదాయాన్నిపెంచవచ్చని అన్నారు. రాజ్‌భవన్‌లు దీనిని ప్రోత్సహించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలగురించి ఆకాశాకెత్తేశారు. గిరిజన జనాభాలో ఎక్కువ భాగం షెడ్యూల్డ్, గిరిజన ప్రాంతాలలో నివసిస్తున్నారని, ఈ ప్రాంతాల ప్రజల సమగ్ర అభివృద్ధిని సాధించడానికి మార్గాలను సూచించాలని ఆమె గవర్నర్లను కోరారు. ఐక్యతా స్ఫూర్తిని మరింత బలోపేతం చేసేందుకు గవర్నర్లు సహకరించాలని అన్నారు. గవర్నర్లందరూ తమ ప్రమాణానికి న్యాయం చేస్తూ ప్రజల సేవకు, సంక్షేమానికి తమ వంతు సహకారం అందించాలని ఆమె కోరారు.
గవర్నర్లు కేంద్ర, రాష్ట్రాల మధ్య వారధులు : మోడీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, గవర్నర్లు కేంద్రం, రాష్ట్రాల మధ్య వారధిగా ఉండాలని అన్నారు. గవర్నరు పదవి రాజ్యాంగ పరిధిలోని రాష్ట్ర ప్రజల సంక్షేమంలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కీలకపాత్ర పోషించగలదని అన్నారు. కేంద్ర హౌం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు, అభివృద్ధి పనులకు పూనుకోవడానికి గ్రామాలను, వెనుకబడిన జిల్లాలను సందర్శించాలని గవర్నర్లను కోరారు.