ఐదో స్థానానికి డిప్యూటీ సిఎం దుష్యంత్‌

  • ‘ఉచన కలాన్‌’లో బిజెపి విజయం
  • 32 ఓట్ల తేడాతో గెలుపు

చండీగఢ్‌ : హర్యానాలోని ఉచన కలాన్‌ స్థానం చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానం నుంచి బిజెపి అభ్యర్థి దేవేంద్ర అత్రి కేవలం 32 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన బ్రిజేంద్ర సింగ్‌పై విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉచన కలాన్‌ నియోజకవర్గం డిప్యూటీ సిఎం, జెజెపి అధ్యక్షుడు దుష్యంత్‌ చౌతాలా గతంలో గెలుపొందిన స్థానం. విచిత్రంగా ఈ సారి ఆయన ఐదో స్థానంలో నిలిచారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు సైతం చౌతాలా కంటే అధిక ఓట్లను పొందారు.
ఈ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి దేవేంద్ర అత్రికి 48968 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి బ్రిజేంద్ర సింగ్‌కు 48936 ఓట్లు వచ్చాయి, ఇద్దరి గెలుపోటముల్లో తేడా కేవలం 32 సీట్లు మాత్రమే. కేంద్ర మాజీ మంత్రి బీరేంద్ర సింగ్‌ కుమారుడు బ్రిజేంద్ర సింగ్‌ లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపిని వీడి కాంగ్రెస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి టిక్కెట్‌ లభించనప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో బ్రిజేంద్ర సింగ్‌ ఆధిక్యంలో ఉండగా చివరికి 32 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు.

దుష్యంత్‌ చౌతాలా రాజకీయాలను పరిశీలిస్తే..
దుష్యంత్‌ చౌతాలా 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిజెపితో పొత్తు పెట్టుకుని డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన జెజెపి, బిజెపితో తెగదెంపులు చేసుకున్నారు. ఈ సారి దుష్యంత్‌ చౌతాలాకు 7950 ఓట్లు మాత్రమే వచ్చాయి. దుష్యంత్‌ చౌతాలా 2019లో 45 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

➡️