- మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సమాజానికి సేవ చేయాలనే తపన ఎంతో మంది ప్రతిభావంతుల్లో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆదివారం తన 114వ మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు అత్యధిక మొక్కలు నాటాయని తెలిపారు. ఇదంతా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా జరిగిందన్నారు. ‘మన్ కీ బాత్’లో వచ్చిన ఉత్తరాలు చదివినప్పుడు తన హృదయం విజయగర్వంతో నిండిపోతుందని అన్నారు. మన దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారని, దేశానికి, సమాజానికి సేవ చేయాలనే తపన వారిలో ఉందని పేర్కొన్నారు. మనదేశం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మేకిన్ ఇండియా కార్యక్రమం ప్రారంభించి పదేళ్లయిందన్నారు. ప్రతి రంగంలోనూ ఎగుమతులు పెరిగాయని, ఎఫ్‌డిఐలను ఆకర్షించడంలో ప్రభుత్వం పురోగతి సాధించిందని చెప్పారు. రానున్న పండగ సీజన్‌లో స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలను కోరారు.