న్యూఢిల్లీ : కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌కి ఆరో షెడ్యూల్ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానికి పాదయాత్ర చేస్తున్న సామాజిక కార్యకర్త వాంగ్‌చుక్‌తో సహా లడఖ్‌కి చెందిన 120 మందిని ఢిల్లీ సరిహద్దుల్లో సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు వాంగ్‌చుక్‌ని నిర్బంధించడం పట్ల ప్రతిపక్షాలు మండిపడ్డాయి. లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ఈ చర్య ఆమోదయోగ్యం కాదు అని అన్నారు. ఈ మేరకు రాహుల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ”పర్యావరణ, రాజ్యాంగ హక్కుల కోసం శాంతియుతంగా మార్చ్ చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌జీతోపాటు వందలాది లడఖీలను నిర్బంధించడం ఆమోదయోగ్యం కాదు. లడఖ్ భవిష్యత్తు కోసం నిలబడినందుకు వృద్ధులను ఢిల్లీ సరిహద్దుల్లో ఎందుకు నిర్బంధించారు? మోడీజీ రైతులపట్ల మీరు పన్నిన పద్మవ్యూహం బద్దలవుతుంది. అలాగే మీకున్న అహంకారం కూడా. భవిష్యత్తులో మీరు లడక్ స్వరాన్ని వినాల్సి వస్తుంది’ అని రాహుల్ పోస్టులో పేర్కొన్నారు.
కాగా, వాంగ్‌చుక్‌ని నిర్బంధించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. హక్కుల సాధన కోసం దేశ రాజధానికి వచ్చే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన అన్నారు. వాంగ్‌చుక్‌ని నిర్బంధించడం పిరికిపంద చర్య అని, అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అభివర్ణించారు.
లడఖ్‌ని రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చడమన్నది వారి ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఈ షెడ్యూల్ స్థానికులకు వారి భూమి, సాంస్కృతిక గుర్తింపును రక్షించడానికి చట్టాన్ని రూపొందించే అధికారాలను ఇస్తుంది. అలాగే లేV్‌ా, కార్గిల్ జిల్లాలకు ప్రత్యేక లోక్‌సభ స్థానాలను ఏర్పాటు చేయాలనేది వారి మరో డిమాండ్‌గా ఉంది. వాంగ్‌చుక్‌తోపాటు లడఖ్‌కి చెందిన ఇతర వాలంటీర్లు తమ డిమాండ్లకు సంబంధించి కేంద్రాన్ని కోరేందుకు సెప్టెంబర్ 1 నుండి లేV్‌ా నుండి దేశ రాజధానికి ఢిల్లీకి పాదయాత్ర చేపట్టారు. అయితే వృద్ధులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల వాంగ్‌చుక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యానికి తల్లి అయిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో.. బాపు సమాధి వద్దకు మేము అత్యంత శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నాం’ అని ఆయన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.