Dharavi Project: ‘చెత్తకుప్ప’కు ధారావి నివాసితులు

Apr 11,2025 23:06 #Adani Group, #Dharavi project

పునరావాసం కోసం డియోనార్‌ డంప్‌
అతిపెద్ద వ్యర్థాల డంప్‌లో ఇదీ ఒకటి
దాదాపు లక్ష మందికి అక్కడే ‘అద్దె యూనిట్లు’
ఇది విషవాయువులను వెదజల్లే కూపం
సగటున గంటకు 6202 కేజీల మేథేన్‌ విడుదల
ఇప్పటికే తరలింపు ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగల్‌
‘మహాయుతి’ సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు
చర్చనీయాంశంగా అదానీ-మహారాష్ట్ర ‘ధారావి ప్రాజెక్టు’

మహారాష్ట్రలో ఉన్న అతిపెద్ద మురికివాడ ధారావి. ఇక్కడ ఎంతో మంది దారుణ పరిస్థితుల్లోనే జీవిస్తున్నారు. అయితే, వీరి కోసం ధారావి మురికివాడ పునరాభివృద్ధి ప్రాజెక్టును ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టులోని 50వేల నుంచి 1 లక్ష మంది నివాసితులకు ముంబయిలోని అతిపెద్ద వ్యర్థాల డంప్‌లలో ఒకటైన డియోనార్‌ ల్యాండ్‌ఫిల్‌ వద్ద పునరావాసం కల్పించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. అయితే, అతిపెద్ద విషవాయువులను వెదజల్లే ఈ మురికి ప్రదేశానికి నివాసితులను తరలించాలనే ప్రభుత్వం నిర్ణయంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు చర్యలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.

ముంబయి : ధారావి మురికివాడ పునరాభివృద్ధి ప్రాజెక్టును అదానీ గ్రూప్‌-మహారాష్ట్ర ప్రభుత్వ జాయింట్‌ వెంచర్‌ నిర్వహిస్తున్నది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ), క్షేత్రస్థాయి సందర్శనలు, ఈ ప్రాజెక్టుల్లో భాగమైన అధికారుల ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. డియోనార్‌కు తరలింపు ప్రక్రియ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీబీసీబీ) రూపొందించిన పర్యావరణ నిబంధనలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నదని వెల్లడవుతున్నది. క్లోజ్డ్‌ల్యాండ్‌ఫిల్‌ (మూసివేయబడిఉన్న చెత్తకుప్ప)లో అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో సీపీసీబీ 2021 మార్గదర్శకాల ప్రకారం.. ఆస్పత్రులు, గృహాలు, పాఠశాలలు, సౌకర్యాలను ల్యాండ్‌ఫిల్‌ లోపల నిర్మించకూడదు. దాని సరిహద్దు నుంచి వంద మీటర్ల అభివృద్ధి రహిత జోన్‌ తప్పనిసరి.

డియోనార్‌.. డేంజర్‌ ప్లేస్‌
డియోనార్‌ ప్రాంతం విషవాయువులను వెదజల్లే కూపం. వ్యర్థాల కుప్పల నుంచి బయటకు వచ్చే ద్రవం, భూగర్భజలాలు, ఉపరితల నీరు, నేలను విషపూరిత సేంద్రీయ, అకర్బన కాలుష్య కారకాలతో కలుషితం చేసే అవకాశం ఉన్నది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ప్రిన్సిపల్‌ బెంచ్‌కు సమర్పించిన 2024 సీపీసీబీ నివేదిక ప్రకారం.. డియోనార్‌ ల్యాండ్‌ఫిల్‌ నుంచి సగటున ప్రతి గంటకు 6202 కేజీల మేథేన్‌ విడుదలవుతుంది. భారత్‌లోని టాప్‌ 22 మీథేన్‌హాట్‌స్పాట్‌లలో ఇది ఒకటి. దీంతో ధారావి నివాసితులను డియోనార్‌ ప్రదేశానికి తరలించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. మహారాష్ట్రలోని మహాయుతి సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏమిటీ ఈ ప్రాజెక్టు?
ధారావిలో ఉన్న 600 ఎకరాలలో 296 ఎకరాలు ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టు (డీఆర్‌పీ) కోసం కేటాయించారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద మురికివాడను.. మెరుగైన గృహాలు, సౌకర్యాలతో ఆధునిక పట్టణ కేంద్రంగా మార్చటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నది. అక్కడ నివసించేవారికి ఇన్‌-సిటు, ఎక్స్‌-సిటు పునరావాసం కల్పించాలని ఇది ప్రతిపాదిస్తుంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌వీఆర్‌ శ్రీనివాస్‌ ఈ ప్రాజెక్ట్‌ సీఈఓగా ఉన్నారు.
ఈ పునరాభివృద్ధి ధారావి రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ (డీఆర్‌పీపీఎల్‌)ను ప్రస్తుతం నవభారత్‌ మెగా డెవలపర్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎండీపీఎల్‌) అని పిలుస్తారు. ఇది ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పీవీ). దీనిలో అదానీ ప్రాపర్టీస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ (ఏపీపీఎల్‌) 80 శాతం ఈక్విటీని, రాష్ట్ర గృహనిర్మాణ శాఖకు చెందిన మురికివాడ పునరావాస అథారిటీ (ఎస్‌ఆర్‌ఏ) 20 శాతం వాటాను కలిగి ఉన్నది. ఎన్‌ఎండీపీఎల్‌ చైర్మెన్‌గా కూడా శ్రీనివాసే ఉన్నారు. కంపెనీల రిజిస్ట్రార్‌ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఎన్‌ఎండీపీఎల్‌ చెల్లించిన మూలధనం రూ.400 కోట్లు. బీఎంసీ కమిషనర్‌ భూషణ్‌ గగ్రాని కూడా ఈ ఎస్‌పీవీలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఎన్‌ఎండీపీఎల్‌ బోర్డులో తొమ్మిది మంది డైరెక్టర్లు ఉన్నారు. వారిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డులో డైరెక్టర్‌గా ఉన్న ప్రణవ్‌ అదానీ కూడా ఒకరు. మిగిలిన ఎనిమిది మంది కూడా అదానీ గ్రూపులోని వివిధ కంపెనీల సీనియర్‌ ఎగ్జిక్యుటివ్‌లు, డైరెక్టర్లు.

అర్హతలేని లబ్దిదారుల పేరుతో తరలింపు
ధారావి పునరావాస ప్రాజెక్టు నిర్మాణ పనులు ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి ప్రారంభమవుతాయని శ్రీనివాస్‌ చెప్పారు. నివాసితులకు పునరావాసం కల్పించటానికి ఎన్‌ఎండీపీఎల్‌ ఏండేండ్ల గడువును కలిగి ఉన్నదని తెలిపారు. ధారావి ప్రాజెక్టు కింద లబ్దిదారులను రెండు వర్గాలుగా విభజించారు. ఇందులో ఒకరిని అర్హులుగా, మరొకరిని అనర్హులుగా వర్గీకరించారు. అర్హులు అంటే.. 2000, జనవరి 1 లేదా అంతకముందు గృహ నిర్మాణాలను కలిగి ఉన్నవారు. దాదాపు 1.5 లక్షల మంది ‘అర్హులకు’ ధారావిలోనే ‘ఇన్‌ సిటు’ పునరావాసం లభిస్తుంది. ఇక అర్హతలేని లబ్దిదారుల్లో దాదాపు 50వేల నుంచి 1 లక్ష మందికి డియోనార్‌ డంప్‌ వద్ద ‘నామమాత్రపు’ ధరలకు అద్దె యూనిట్లు అందుతాయని ప్రభుత్వం ప్రకటించింది. మిగిలినవారికి ప్రభుత్వం కుర్లా డెయిరీ, వాడాలా, కంజుర్‌మార్గ్‌, ములుంద్‌ మధ్య భూమిని కేటాయించింది.
గతేడాది సెప్టెంబర్‌లో బీఎంసీ 311 ఎకరాల పెద్ద డియోనార్‌ ల్యాండ్‌ఫిల్‌లోని 124 ఎకరాలను పునరావాస ప్రాజెక్ట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. లబ్దిదారుల సర్వే పూర్తయిన తర్వాత ఈ భూమిని ఎన్‌ఎండీపీఎల్‌కు అప్పగిస్తామని గృహ నిర్మాణశాఖాధికారులు తెలిపారు. ఎన్‌ఎండీపీఎల్‌కు కేటాయించిన 124 ఎకరాల భూమిలో ప్రస్తుతం డంప్‌ వద్ద ఉన్న మొత్తం ఘన వ్యర్థాలలో 40 శాతం (దాదాపు 80 లక్షల మెట్రిక్‌ టన్నులు) ఉన్నాయి. ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌ కోసం మాకు సుమారు 200-300 ఎకరాల భూమి అవసరం. దీంతో మేము డియోనార్‌ ప్రాంతాన్ని ఎంచుకున్నాం అని డీఆర్‌పీ సీఈఓ శ్రీనివాస్‌ అన్నారు.

➡️