‘మహాత్మా గాంధీ హత్య’పై పాఠ్యాంశం అవసరం లేదు ! : ధర్మేంద్ర ప్రధాన్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జాతిపిత మహాత్మా గాంధీ హత్యపై పాఠ్యాంశం అవసరం లేదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. గాంధీ ఎలా చనిపోయారో దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలుసునని, దానిని మళ్లీ మళ్లీ బోధించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. గాంధీజీ ఎలా హత్యకు గురయ్యారో అందరికీ తెలుసు అని, దాన్ని మళ్ళీ ఒక సబ్జెక్ట్‌గా చేయడం సరైనదేనా?’ అని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు. ఈ అంశాన్ని సిలబస్‌ నుండి మినహాయించడాన్ని కూడా మంత్రి సమర్థించుకున్నారు. పాలక ప్రభుత్వానికి విరుద్ధమైన అంశాలేవీ సిలబస్‌లో ఉండదని ఆయన చెప్పారు.

హిందీని రుద్దడం లేదట !

హిందీ భాషపైనా కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కేంద్రం తీరును సమర్థించుకున్నారు. హిందీ భాషను రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ ప్రయత్నించదని చెప్పుకొచ్చారు. భాషా వైవిధ్యాన్ని తిరస్కరించే వారే హిందీని రుద్దుతున్నట్లు భావిస్తున్నారని పేర్కొన్నారు. 22 షెడ్యూలు భాషలను కేంద్రం సమానంగా చూస్తుందన్నారు. ఈ అంశంపై జరిగిన చర్చలో సిపిఎం ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ కూడా పాల్గొన్నారు. విద్యా రంగంతో సహా అన్ని రంగాల్లోనూ కేంద్ర ప్రభుత్వం మితిమీరిన కేంద్రీకరణకు ప్రయత్నిస్తోందని తప్పుబట్టారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే ఇటువంటి చర్యలను విరమించుకోవాలని కోరారు. రాష్ట్రాల హక్కులను గౌరవించాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

➡️