– పోలీసు నిర్బంధంపై జాతీయ నాయకుల ఆగ్రహం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :జోరు వానలో, పోలీసు నిర్బంధం నడుమ అఖిల భారత ఇపిఎస్ 95 పెన్షనర్ల ఆందోళన రెండోరోజూ కొనసాగింది. కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని, డిఎ ఇవ్వాలని, వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి జంతర్ మంతర్ వద్ద బుధవారం జరిగిన ధర్నాను ఉద్ధేశించి ఆల్ ఇండియా కోాఆర్డినేషన్ కమిటీ జాతీయ అధ్యక్షులు మోహనన్ ప్రసంగించారు. అనుమతి కోసం పోలీస్ ఉన్నతాధికారులకు ముందుగా దరఖాస్తు చేశామని, సుప్రీంకోర్టు ఆదేశాల పేరుతో అనుమతించకపోగా, నిర్బంధం విధించడం సరైన విధానం కాదని అన్నారు. జాతీయ కార్యదర్శి అతుల్ దిగే మాట్లాడుతూ.. కేంద్ర కార్మికశాఖ మంత్రికి ఇపిఎస్ పెన్షనర్ల సమస్యలపై వినతిపత్రం అందజేసి చర్చించామన్నారు. కార్మిక మంత్రి మరో మూడు నెలలు సమయం కావాలని, త్వరలో దీనిపై ప్రత్యేక సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామన్నారని తెలిపారు. గత పదేళ్లుగా మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ఇపిఎస్ 95 పెన్షనర్ల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంభించిందని విమర్శించారు. పార్లమెంటులో సిపిఎం తదితర పార్టీల ఎంపిలు ప్రత్యేక ప్రస్తావన తెచ్చినా, మోడీ ప్రభుత్వం ఇపిఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ మంజూరు చేయడానికి తిరస్కరించడాన్ని ఖండిస్తున్నామన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇపిఎస్ 95 పెన్షనర్ల కార్పస్ ఫండ్ రూ.7.80 లక్షల కోట్లు అని, దానిపై రూ.15 వేల కోట్ల వడ్డీ రేమో వడ్డీ రూపంలో జమవుతుందని తెలిపారు. దాని నుండి సుమారు రూ.4 వేల కోట్లు మాత్రమే పెన్షన్ల రూపంలో చెల్లిస్తున్నారని, మిగిలిన మొత్తం తిరిగి ఇపిఎఫ్‌ఒ నిధులకు జమ చేస్తున్నారని విమర్శించారు. ఇపిఎస్ పెన్షనర్ల సొమ్మును ఇతర ఖర్చులకు మళ్లించకూడదని డిమాండ్ చేశారు.
ఎఇసిసి జాతీయ సహాయ కార్యదర్శి కె సత్తిరాజు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 35 లక్షల మంది పెన్షనర్లు రూ.500 పెన్షన్ కూడా పొందలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. కేరళ, హర్యానా వంటి రాష్ట్రాల్లో సామాజిక పెన్షన్లను ఇపిఎస్ పెన్షన్లతోపాటు కలిపి చెల్లిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పెన్షన్ రూ.4 వేలు చెల్లిస్తున్నారని తెలిపారు. అంతకంటే తక్కువ ఇపిఎస్ పెన్షన్ పొందుతున్న వారందరికీ అన్ని రాష్ట్రాల్లో సామాజిక పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. హయ్యర్ పెన్షన్ కోసం రూ.4 కోట్ల వరకూ ఇపిఎఫ్‌ఒకు చెల్లించిన విశాఖ సేల్ స్టీల్‌ప్లాంట్ పెన్షనర్లకు కూడా మొండి చేయి చూపారని, వెంటనే బకాయిలుసహా హయ్యర్ పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. హయ్యర్ పెన్షన్ కోసం సొమ్ము చెల్లించిన దేశంలోని పలు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగుల కేసులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బెంగాల్, తెలంగాణ, పాండిచ్ఛేరి, ఒడిశా, హర్యానా తదితర రాష్ట్రాల పెన్షనర్లు పాల్గన్నారు.
