డిమాండ్లు పరిష్కరిస్తేనే దీక్ష విరమణ

  • రైతు ఉద్యమ నేత దల్లేవాల్‌

చండీగఢ్‌ : కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ కల్పించడంతో పాటూ రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించేవరకు తన నిరాహార దీక్షను విరమించేది లేదని రైతు నేత, గత 46 రోజులుగా నిరశన చేస్తున్న జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ స్పష్టం చేశారు. తన దీక్ష విరమణకు అకల్‌ తక్త్‌ను జోక్యం చేసుకునేలా చూడాలని బిజెపి ప్రయత్నిస్తోందని, దాని కన్నా ప్రధాని మోడీతో సమావేశం జరిపించేలా చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మూడు నిముషాల వీడియోను విడుదల చేశారు. రైతుల డిమాండ్లను కేంద్రం ఆమోదిస్తేనే తాను దీక్ష విరమిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్యం క్షీణిస్తున్నందున దల్లేవాల్‌ విషయంలో జోక్యం చేసుకుని ఆయన దీక్ష విరమించేలా చూడాల్సిందిగా బిజెపి ప్రతినిధి బృందం గురువారం అకల్‌ తక్త్‌ జతేదార్‌కు విజ్ఞప్తి చేసింది. అయితే బిజెపి బృందం చేసిన విజ్ఞప్తిని దల్లేవాల్‌ తప్పుబట్టారు. దీక్ష విరమించాలని ఆదేశాలు జారీ చేయాలని అకల్‌ తక్త్‌ను బిజెపి నేతలు కోరినట్లు తనకు సమాచారం అందిందని, తాను అకల్‌ తక్త్‌ను గౌరవిస్తానని, కానీ బిజెపి ప్రతినిధులు అకల్‌ తక్త్‌ జతేదార్‌కు బదులుగా ప్రధాని మోడీని, ఉపరాష్ట్రపతి, వ్యవసాయ మంత్రి, హోంమంత్రిలను కలవాలని దల్లేవాల్‌ వ్యాఖ్యానించారు. సమస్యను పరిష్కరించాల్సింది అకల్‌ తక్త్‌ కాదని, కేంద్ర ప్రభుత్వమని ఆయన గుర్తు చేశారు. రైతుల డిమాండ్ల సాధన కోసం నవంబరు 26న దల్లేవాల్‌ ఖనౌరి సరిహద్దు పాయింట్‌ దగ్గర నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.

➡️