delimitation issue: పార్లమెంటు ఎదుట డిఎంకె నిరసన

న్యూఢిల్లీ : డీలిమిటేషన్‌ అంశంపై సోమవారం పార్లమెంట్‌ ఆవరణలో డిఎంకె నిరసన చేపట్టింది. డిఎంకె తిరుచ్చి శివ సహా పలువురు ఇతర పార్టీల ఎంపిలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా తిరుచ్చి శివ మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌ ప్రక్రియకు బదులుగా ప్రత్యామ్నాయాన్ని చేపట్టాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడుతుందని మండిపడ్డారు.

రాజ్యాంగం ప్రకారం.. జనాభా ఆధారంగా డీలిమిటేషన్‌ కసరత్తు 2026లో జరగనుందని అన్నారు. 42వ సవరణ మరియు 84వ సవరణల ప్రకారం.. జనాభా నియంత్రణ పురోగతిని పరిగణించాల్సి వున్నందున 25 సంవత్సరాల తర్వాత చేపట్టాలని నిర్ణయించారని అన్నారు. ఆ ప్రాతిపదికన డీలిమిటేషన్‌ జరిగితే.. తమిళనాడు సహా అన్ని దక్షిణాది రాష్ట్రాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయని పునరుద్ఘాటించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని రూపొందించాలని అభ్యర్థిస్తున్నామని అన్నారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్‌ చేపడితే తమిళనాడు సహా పలు రాష్ట్రాలు చాలా సీట్లను కోల్పోవలసి వుంటుందని అన్నారు. తమిళనాడు 39 సీట్ల నుండి 31కి, కేరళ 20 నుండి 12కి పడిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు 30 నుండి 40కి పెరుగుతాయని, దీంతో పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలు సమాన ప్రాతినిథ్యాన్ని కోల్పోతాయని  అన్నారు.

➡️