నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై పోలీసులు దాడి
రాజస్థాన్: షెకావతి విశ్వవిద్యాలయాన్ని ఆర్ఎస్ఎస్ పాఠశాలగా చేయాలని బిజెపి కోరుతోందని, దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై పోలీసులు దాడి చేశారు. రాజస్థాన్ సికార్‌లోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ షెకావతి విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవ వేడుకలో నిరసన తెలిపిన విద్యార్థుల జుట్టు పట్టుకుని, వారిని తన్నుకుంటూ వేదిక హాల్ నుండి బయటకు పంపారు. తరువాత నలుగురు విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి మహామండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరిని ఆహ్వానించినందుకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ విద్యార్ధులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ జాఖడ్ మాట్లాడుతూ… విశ్వవిద్యాలయ పరిపాలనపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలో విద్యావేత్తలు, గవర్నర్ లనును మాత్రమే ముఖ్య అతిథులుగా ఆహ్వానించే సంప్రదాయాన్ని వైస్ ఛాన్సలర్ ఉల్లంఘించారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ వ్యక్తులను ఆహ్వానించి, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని స్థాపించడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి మహామండలేశ్వర్ కైలాసానంద గిరి గల అర్హతల ఏమిటని ప్రశ్నించారు. విద్యకు, సమాజానికి ఆయన చేసిన ప్రత్యేక కృషి ఏమిటని ప్రశ్నించారు. ధ్యానం, ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితమైన వ్యక్తిని విద్యా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేయడం ఎంతవరకు సముచితమని వారు ఆగ్రహించారు. రెండు రోజుల ముందే తాము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి, విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మను కూడా దహనం చేశామని పేర్కొన్నారు. మహామండలేశ్వర్ అతిథిగా వస్తే ఆందోళన తప్పదని ముందే హెచ్చరించమని తెలిపారు.