రైల్వేను ప్రయివేటీకరించొద్దు

  • లోక్‌సభలో నినదించిన ప్రతిపక్షాల సభ్యులు

ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రవేశపెట్టిన రైల్వే సవరణ బిల్లుపై చర్చ పూర్తయ్యింది. బిల్లుపై జరిగిన చర్చలో రైల్వేలను ప్రైవేటీకరణకు దూరంగా ఉంచాలని ప్రతిపక్ష ఎంపిలు కోరారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపి నీరజ్‌ మౌర్య రైల్వేలను ప్రైవేటీకరణ చేతుల నుండి దూరంగా ఉంచాలన్న అభ్యర్థనను పునరుద్ఘాటించారు. దేశానికి రైల్వే జీవనాధారమని, రైల్వే బోర్డు నిర్ణయాధికారంలో స్వతంత్రంగా ఉండేందుకు అనుమతించాలని అన్నారు. చలికాలంలో పొగమంచు కారణంగా ప్రయాణంలో జాప్యానికి సంబంధించిన సమస్యలను లేవనెత్తారు. కోవిడ్‌ సమయంలో అనేక రైళ్లు రద్దు చేశారని, వాటిలో చాలా వరకు పునఃప్రారంభించలేదని తెలిపారు. రైల్వే బోర్డు నిర్ణయాలపై ప్రభుత్వం జోక్యం కొనసాగిస్తుందా? అని శివసేన (యుబిటి) ఎంపి అరవింద్‌ సావంత్‌ ప్రశ్నించారు. రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణలో నిర్వాసితులకు పునరావాసం ఇంకా అందించలేదని అన్నారు. ప్రభుత్వం ఖాళీల భర్తీకి ప్రాధాన్యతనివ్వాలని సిపిఎం ఎంపి అమ్రారామ్‌ కోరారు. ప్రస్తుతం జరుగుతున్నట్లుగానే రైల్వే ఉద్యోగులపై పనిభారం పడకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. లోకో పైలెట్‌లు, టికెట్‌ కలెక్టర్‌ (టిసి), టికెట్‌ ఎగ్జామినర్లు (టిఇ) సహా రైల్వేలోని ఉద్యోగులకు విశ్రాంతి, పనికోసం సరైన సమయం కల్పించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనేక ప్రాజెక్టులు, మరమ్మతు పనులు పూర్తి కావడానికి నిర్ణీత తేదీ లేకుండా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. రైల్వే బోర్డులో షెడ్యూల్డ్‌ కులాలు, తెగల సభ్యులను చేర్చాలని సేలంపూర్‌ ఎంపి రామశంకర్‌ రాజ్‌భర్‌ కోరారు.

➡️