- ఏకపక్షంగా టారిఫ్‌లు పెంచేస్తున్నాయి
- ఏటా లక్ష కోట్ల లాభాలు దండుకుంటున్నాయి
- ఎలన్ మస్క్‌కు అనుకూలంగా స్పెక్ట్రమ్ కేటాయింపు విధానం
- ట్రాయ్ కి కేంద్ర మాజీ కార్యదర్శి శర్మ బహిరంగ లేఖ
న్యూఢిల్లీ : ప్రైవేటు టెలికం కంపెనీలు ఏకపక్షంగా టారిఫ్‌ను పెంచుతున్నప్పటికీ టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రారు) ఎందుకు మౌనం వహిస్తోందని భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్ శర్మ నిలదీశారు. దీనిపై టెలికం శాఖ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్రారు ఛైర్మన్ ఎకె లఖోటీకి ఓ బహిరంగ లేఖ రాశారు. రెండు ప్రముఖ టెలికం కంపెనీలు భారీగా టారిఫ్‌లను పెంచాయంటూ తాను జూలై 10వ తేదీన కూడా ట్రాయ్, టెలికం శాఖ దృష్టికి తీసుకెళ్లానని ఆయన అందులో గుర్తు చేశారు. ప్రైవేటు టెలికం కంపెనీలు నిస్సహాయులైన లక్షలాది మంది వినియోగదారుల నుండి టారిఫ్‌ల రూపంలో వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికాకు చెందిన వ్యాపారవేత్త ఎలన్ మస్క్‌కు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయింపు విధానాన్ని మార్చేసిందని ఈ నెల 22న రాసిన లేఖలో శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ‘2జీ స్పెక్ట్రమ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా ఎలన్ మస్క్ డిమాండుకు సంబంధిత కేంద్ర మంత్రి అంగీకారం తెలిపారు. ఉపగ్రహ స్పెక్ట్రమ్‌కు పాలనా సంబంధమైన కేటాయింపులు జరపాలని మస్క్ డిమాండ్ చేశారు’ అని తెలిపారు. డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు వీలుగా మరోసారి టారిఫ్ పెంపుదలకు అనుమతించాలంటూ ఎయిర్‌టెల్ అధిపతి సునీల్ భారతి మిట్టల్ ఇటీవల చేసిన ప్రకటనను శర్మ ప్రస్తావించారు. ట్రారు, టెలికం శాఖ ఏవైనా అక్రమాలకు పాల్పడి ఉంటే వాటిని బయటికి తీసేందుకు స్వతంత్ర విచారణకు ఆదేశించాలని తాను క్యాబినెట్ కార్యదర్శికి లేఖ రాశానని శర్మ తెలిపారు. ఒకవేళ అక్రమాలు జరిగి ఉంటే వాటిపై పార్లమెంట్, ప్రజలు చర్చించే అవకాశం లభిస్తుందని అన్నారు. ఏటా లక్ష కోట్ల రూపాయల అదనపు లాభాలు ఆర్జించడానికి టెలికం కంపెనీలు ఏకపక్షంగా టారిఫ్‌లు పెంచితే దానిపై ట్రాయ్ గళం విప్పాల్సిన అవసరం లేదా? అని శర్మ తన లేఖలో ప్రశ్నించారు.