వ్యక్తులను కట్టేసి,కొట్టే అధికారం పోలీసులకుందా ? : ఖెడా సంఘటనను ప్రస్తావిస్తూ సుప్రీం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : గార్బా ఉత్సవానికి ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో 2022లో గుజరాత్‌లోని ఖెడా జిల్లాలో నలుగురు పోలీసులు ఒక స్తంభానికి ముస్లింలను కట్టివేసి బహిరంగంగా కొరడా దెబ్బలు కొట్టిన సంఘటనను సుప్రీం కోర్టు మంగళవారం పేర్కొంటూ అందుకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. ‘మనుష్యులను స్తంభానికి కట్టేసి, కొట్టే అధికారం వారికి వుందా’ అని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి చట్టంలో ఏదైనా అధికారం వుందా అని జస్టిస్‌ బి.ఆర్‌.గవారు ప్రశ్నించారు. పైగా దాన్నంతా వీడియోలు కూడా తీసుకున్నారని మరో న్యాయమూర్తి జస్టిస్‌ సందీప్‌ మెహతా మధ్యలో జోక్యం చేసుకుంటూ వ్యాఖ్యానించారు. కోర్టును ధిక్కరించినందుకు తమకు 14 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ అక్టోబరులో గుజరాత్‌ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ పోలీసు అధికారులు సుప్రీం కోర్టుకు అప్పీల్‌ చేసుకున్నారు. వారిపై హైకోర్టులో తీసుకున్న కోర్టు ధిక్కార చర్యల అమలుపై బెంచ్‌ స్టే విధించింది. పోలీసుల దూషణలు, కస్టడీలోని వారి పట్ల హింసాత్మకంగా వ్యవహరించడమన్నది కోర్టు ధిక్కార చర్యల కిందకు వస్తాయని 1996లో డి.కె.బసు తీర్పులో సుప్రీం పేర్కొంది. పోలీసులు, చట్టాన్ని అమలు చేసే ఇతర అధికారులు ఒక వ్యక్తిని వేధించి, దూషించడం నుండి రక్షణ కల్పించడానికి సమాజంలో వ్యక్తమవుతున్న తీవ్ర ఆందోళనను ఆ తీర్పు ప్రముఖంగా ప్రస్తావించింది. పోలీసుల తరపు వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాది సిద్ధార్ధ్‌్‌ దావె మాట్లాడుతూ, తమ క్లయింట్లు ఉద్దేశ్యపూర్వకంగా కోర్టును ధిక్కరించలేదని చెప్పారు. అయితే వారి వాదనలతో జస్టిస్‌ గవారు, సందీప్‌ మెహతాలు ఏకీభవించలేదు. చట్టం గురించి తెలియకపోవడమనేది ఇప్పుడు చట్టంలో రక్షణగా మారిందా అని బెంచ్‌ ప్రశ్నించింది. డి.కె.బసు కేసులో చట్టం ఏం చెప్పిందన్నది ప్రతి పోలీసు అధికారి తెలుసుకోవాలని, అది వారి విధి అని జస్టిస్‌ గవారు వ్యాఖ్యానించారు.

➡️