- కల్తీ నెయ్యి వాడినట్లు ప్రాథమిక సాక్షాధారాలు లేవు
- సిఎం వ్యాఖ్యల ఔచిత్యాన్ని ప్రశ్నించిన ధర్మాసనం
- గురువారానికి విచారణ వాయిదా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తిరుమల లడ్డు వ్యవహారంలో అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘లడ్డు కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఉందా… కల్తీ జరిగిందని చెప్పడానికి శ్యాంపిల్‌ను ల్యాబ్ కు పంపారా? ఎందుకు పంపలేదు?’ అని ప్రశ్నించింది. ‘కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంపై రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నవారు నేరుగా మీడియా ముందు ఎలా మాట్లాడతారు?’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలలోని ఔచిత్యాన్ని నిలదీసింది. ‘కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి’ అని పేర్కొంది. తిరుపతి లడ్డూ వివాదంపై కోర్టు పర్యవేక్షణలో, లేదా విచారణ జరిపించాలని వైసిపి ఎంపి, టిటిడి మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, బిజెపి సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి, చరిత్రకారుడు విక్రమ్ సంపత్, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు దుష్యంత్ శ్రీధర్, సుదర్శన్ న్యూస్ యాంకర్ సురేష్ చవాన్కే దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ కెవి విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీని ప్రశ్నించింది.ఈ వివాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు అవసరమా? లేదా అనేదానిపై కేంద్ర ప్రభుత్వం నుండి సూచనలు కోరాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం కోరింది. అనంతరం కేసును గురువారానికి వాయిదా వేసింది.
ఏం ఆధారాలున్నాయి?
అంతకుముందు ఈ వ్యవహరంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం ఏమోచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. కల్తీ జరిగిందనే వాదనను ధ్రువీకరించడానికి ఎటువంటి ప్రాధమిక సాక్ష్యాధారం లేదని పేర్కొంది. లడ్డూలను తయారు చేయడానికి జంతువుల కొవ్వును ఉపయోగించినట్లు కచ్ఛితంగా నిర్ధారించడానికి సిఎం వద్ద ఏదైనా ఆధారాలు ఉన్నాయా? అని జస్టిస్ గవారు ప్రశ్నించారు. రిపోర్టు ప్రకారం నెయ్యి నమూనాలు తిరస్కరించారని జస్టిస్ విశ్వనాథన్ అన్నారు. కల్తీ జరిగిందని గుర్తించిన తరువాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా? అలా వినియోగించినట్లు ఆధారాలు లేవు. విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తోంది. బహిరంగంగా మాట్లాడే ముందు వాటిని పరీక్షించడం అవసరం కాదా? అని ధర్మాసనం ప్రశ్నించింది
మనోభావాలను దెబ్బతీస్తారా;?
‘ఈ వ్యవహారం కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసే మనోభావాలకు సంబంధించినది. గత పాలనలో తిరుపతి లడ్డూల తయారీకి జంతువుల కొవ్వును ఉపయోగించారని రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు ముందే ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన సిట్ పని తీరును ప్రభావితంచేయదా? రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు ప్రజల ముందు మాట్లాడటం సముచితం కాదని ప్రాథమికంగా భావిస్తున్నాం. అయితే టిటిడి ఇఒ ఇలాంటి కల్తీ నెయ్యిని లడ్డు తయారికి ఉపయోగించలేదని ఒక ప్రకటన చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో సిఎంతో టిటిడి ఇఒ విభేదించారు. ఇద్దరి ప్రకటనలకు పొంతన లేదు.’ అని ధర్మాసనం పేర్కొంది. టిటిడి తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ.. ‘కొన్ని ట్యాంకర్లకు సంబంధించి ఆ ప్రకటన చేశారు’ అని అన్నారు. సుబ్రమణ్యస్వామి తరపు సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదనలు వినిపిస్తూ ముఖ్యమంత్రి ఏ ప్రాతిపదికన అలాంటి ప్రకటన చేశారనేదానిపై ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన వ్యక్తి బహిరంగ ప్రకటన చేసినప్పుడు ఆధారాలు ఉండాలని అన్నారు
అంత సమయం ఎందుకు?
జస్టిస్ విశ్వనాధ్ ఒక దశలో జోక్యం చేసుకుంటూ ‘నెయ్యిలో కల్తీ జరిగినట్లు మీకు జూలైలో నివేదిక వచ్చింది. సెప్టెంబర్ 18న మీరు బహిరంగంగా మాట్లాడారు. ఆ ప్రకటనకు ఆధారాలున్నాయా… అసలంత సమయం ఎందుకు తీసుకున్నారరు?కచ్ఛితంగా తెలియకపోతే ఎందుకు బహిరంగంగా మాట్లాడారు?’ అని ప్రశ్నించారు. జస్టిస్ గవారు ‘లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారా? అని అడిగారు. దీనికి స్పందించిన టిటిడి తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విచారణ జరుగుతోందని తెలిపారు. నెయ్యిలో కల్తీ జరిగినట్లు నివేదిక వచ్చిన తరువాత సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని గవారు ప్రశ్నించారు. ‘ఎన్‌డిడిబి మాత్రమే ఎందుకు? మైసూర్, గజియాబాద్ ల్యాబ్‌ల నుండి సెకండ్ ఒపినియన్ ఎందుకు తీసుకోలేదు?’ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును కొనసాగించడానికి అనుమతించాలా? లేదా దర్యాప్తును వేరే ఏజెన్సీకి బదిలీ చేయాలా? అనేది తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ధర్మాసనం సూచించింది.