క్రీడలను రాజకీయం చేయొద్దు 

Nov 29,2023 11:22 #cpm, #UAPA

ఉపా కింద విద్యార్థులను అరెస్టును ఖండించిన తరిగామి

జమ్ము :   క్రీడలను రాజకీయం చేయొద్దని సిపిఎం నాయకులు ఎంవై తరిగామి విజ్ఞప్తి చేశారు. ఉపా చట్టం కింద యూనివర్శిటీ విద్యార్థులను అరెస్టు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. ‘విద్యార్థుల అరెస్టు పూర్తిగా తప్పు. వారిపై ఉపా చట్టం కింద అభియోగాలు మోపడం మరింత అన్యాయం. క్రీడలను రాజకీయం చేయొద్దు’ అని తరిగామి అన్నారు. ‘భారత క్రికెటర్లకు ఇతర దేశాల్లో ఎంత ఆదరణ ఉంటుందో, ఇతర దేశాల క్రికెటర్లకు కూడా భారత్‌లో అంతే ఆదరణ ఉంటుంది. రాజకీయాలను, క్రీడలను లింక్‌ చేయడం మంచిది కాదు’ అని తెలిపారు. ‘వారు (విద్యార్థులు) ఉగ్రవాదులా.. ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటే ఇతర చట్టాలు ఉన్నాయి. విద్యార్థులపై ఉపా కింద కేసులు ఎందుకు నమోదు చేయాలి’ అని తరిగామి ప్రశ్నించారు.

ఈ సందర్భంలో న్యూస్‌క్లిక్‌ సంపాదకులు ప్రబీర్‌ పుర్కాయస్థ, హెచ్‌ఆర్‌ హెడ్‌ అమిత్‌ చక్రవర్తిలను ఉపా చట్టం కింద అరెస్టు చేయడాన్ని కూడా తరిగామి ఖండించారు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓటమితో సంబరాలు చేసుకున్నారని, అభ్యంతరకమైన నినాదాలు చేశారనే ఆరోపణలతో షేర్‌-ఎ-కాశ్మీర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ (ఎస్‌కెయుఎఎస్‌టి) విద్యార్థుల ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రజల దృష్టిని మరల్చడానికి కేంద్రం విభజన రాజకీయాలకు పాల్పడుతుందని తరిగామి విమర్శించారు.

➡️