న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి చేసిన బడ్జెట్ ప్రసంగంపై మంగళవారం లోక్‌సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఎంపి అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదు అని అన్నారు. మోడీ ప్రభుత్వం సాధించిన వివరాలేవీ రాష్ట్రపతి ప్రసంగంలో లేవని అఖిలేష్ విమర్శించారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేపదే డబుల్ ఇంజన్లు అని చెబుతుంది. ఆ డబుల్ ఇంజన్లు క్రాష్ అయ్యాయి. దేశంలో అభివృద్ధిని తీసుకువస్తామన్న వారి వాగ్ధానాలను నెరవేర్చడంలో ఈ డబుల్ ఇంజన్లు విఫలమయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మెట్రోలు, హైవేలు సమాజ్‌వాది పార్టీ హయాంలోనే అభివృద్ధి అయ్యాయని ఆయన నొక్కి చెప్పారు.
కాగా, పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభలో ఇటీవల జరిగిన మహాకుంభ మేళా విషాదాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట వల్ల ఎంతో మంది చనిపోయారు. వారి మృతదేహాలను ట్రాక్టర్ ట్రాలీతో పైకి లేపారు. ఈ తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారనే వివరాలను యోగి ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు? అని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ప్రభుత్వం బడ్జెట్ గణాంకాలను వెల్లడించినట్లు.. మహాకుంభమేళాలో చనిపోయిన వారి సంఖ్యను కూడా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మహాకుంభమేళాకు సంబంధించి యోగి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అఖిలేష్ డిమాండ్ చేశారు.
