ఎన్నికలపై అనుమానాలు

Apr 2,2024 06:44 #2024 elections
  • పరిశీలనకు ఐదుగురితో అంతర్జాతీయ కమిటీ
  • స్వతంత్ర భారత చరిత్రలోనే మొదటిసారి

ప్రజాశక్తి – న్యూఢిల్లీ : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అంతర్జాతీయంగా పొందిన గుర్తింపు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా మన ఎన్నికల ప్రకియను వివిధ దేశాలు అనుమానాస్ప దంగా చూస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టు సందర్భంగా ఐక్యరాజ్య సమితి సైతం దేశంలో నెలకొన్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అమెరికా, జర్మనీలు కూడా భారత్‌ తీరును తప్పుపట్టాయి. ఈ దేశాల వ్యాఖ్యలను మోడీ సర్కారు తోసిపుచ్చింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలోనూ ఈ విషయం చర్చకు వచ్చింది. అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్న ఈ అనుమానాల నేపథ్యంలో త్వరలో జరగనున్న 18వ లోక్‌సభ ఎన్నికలను పరిశీలించి అంతర్జాతీయ సమాజానికి వాస్తవాలను నివేదించేందుకు దేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్న ఐదుగురు మేధావులతో ఒక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సభ్యులు దేశమంతా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు తమ నివేదికలను ప్రకటించనున్నారు. స్వతంత్ర భారత చరిత్రలోనే ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేకపోవడం గమనార్హం. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశంపై ఎమర్జెన్సీని రుద్దిన అనంతరం జరిగిన ఎన్నికల సమయంలోనూ భారతదేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొనసాగుతుందన్న నమ్మకం అంతర్జాతీయంగా వ్యక్తమైంది.
కమిటీలో ఎవరెవరు?
‘భారత ఎన్నికల పర్యవేక్షణ కోసం స్వతంత్ర ప్యానెల్‌-2024’ పేరిట ఏర్పాటైన ఈ కమిటీలో నీరా చందోక్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ జాతీయ రీసెర్చి ఫెలో, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఢిల్లీ యూనివర్సిటీ), డాక్టర్‌ థామస్‌ డాఫ్రెన్‌ (వరల్డ్‌ ఇంటెలెక్చ్యువల్‌ విజ్‌డమ్‌ ఫోరమ్‌ ఛైర్మెన్‌, డైరెక్టరు ఇంటర్నేషనల్‌ పీస్‌ స్టడీస్‌ అండ్‌ గ్లోబల్‌ ఫిలాసఫీ-యుకె, ఫ్రాన్స్‌), షకావత్‌ హుస్సేన్‌ (బంగ్లాదేశ్‌ మాజీ ఎన్నికల కమిషనర్‌), డాక్టర్‌ హరీష్‌ కర్నీక్‌ (మాజీ ప్రొఫెసర్‌ ఐఐటి, కాన్‌పూర్‌), డాక్టర్‌ సెబాస్టియన్‌ మోరీస్‌ (మాజీ ప్రొఫెసర్‌, ఐఐఎం, అహ్మదాబాద్‌, ప్రొఫెసర్‌ రాహుల్‌ ముఖర్జీ (సౌత్‌ ఎసియా ఇన్‌స్టిట్యూట్‌, హీడెల్‌ బెర్గ్‌ యూనివర్సిటీ జర్మనీ) సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ విడుదల చేసిన ప్రీ-ఎలక్షన్‌ రిపోర్టులో ‘దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణ సందేహాస్పదంగా మారింది. పార్టీలకు సమాన అవకాశాలను ఎన్నికల కమిషన్‌ ఇవ్వడం లేదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి’ అని పేర్కొంది. ఎలక్టోరల్‌ బాండ్లలో బిజెపి భారీగా నిధులను పోగేసుకోవడం, క్విడ్‌ ప్రొకో ఆరోపణలను, మీడియా దాదాపుగా బిజెపికి అనుకూలంగా మారి ఏకపక్షంగా వ్యవహరిస్తుండటం తదితర అంశాలను కూడా ఈ కమిటీ ముందస్తు నివేదికలో ప్రస్తావించింది. రాజ్యాంగానికి విరుద్ధంగా అయోధ్య మందిర ప్రారంభాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం, ప్రధాని మోడీ స్వయంగా పాల్గొనడం, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఇది ప్రచార అంశంగా మారిన తీరును కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు.

సార్వత్రిక ఒటు హక్కు నిజంగా ఉందా?

  • ఒక అంచనా ప్రకారం 2019 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ముస్లిం, దళితులు ఓటర్ల జాబితా నుండి గల్లంతైనారు.
  • జమ్మూ కాశ్మీర్‌లో దాదాపుగా ఒక కోటి మందికి 2018 నుండి ఓటు హక్కు నిరాకరించారు.
  • అస్సోంలో దాదాపుగా లక్ష మందిని సందేహాస్పద ఓటర్లుగా గుర్తించారు.
  • ఎన్నికల సంఘం వీరిని ‘డి’ఓటర్లుగా పేర్కొంది.

ఓటర్లు … రాజకీయ ప్రత్యామ్నాయం

  • బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకుంది.
  • కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని క్రిమినల్‌ కేసులు బనాయించాయి.
  • 2014 నుండి సిబిఐ, ఇడిలు పెట్టిన కేసుల్లో 90 శాతం ప్రతిపక్ష పార్టీల పైనే
  • మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా 2017 -2023 మధ్య ఎలక్టోరల్‌ బాండ్లలో అత్యధిక భాగం బిజెపికే దక్కాయి.
➡️