Supreme Court : ఉచితాలపై కేంద్రానికి నోటీసులు

న్యూఢిల్లీ : ఎన్నికల సమయంలో ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కేంద్రానికి, ఎన్నికల కమిషన్‌ (ఇసి)కి నోటీసులిచ్చింది. బెంగళూరు వాసి శశాంక్‌ జె.శ్రీధరా దాఖలు చేసిన తాజా పిటిషన్‌పై సిజెఐ డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి. పార్థివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. తాజా పిటిషన్‌పై స్పందన తెలపాల్సిందిగా కేంద్రం, ఇసిలను ఆదేశించింది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా నిరోధించేలా సమర్థవంతమైన చర్యలు తీసుకునేలా ఇసిని ఆదేశించాలని న్యాయవాది శ్రీనివాసన్‌ పిటిషన్‌లో కోరారు. నియంత్రణలేని ఉచిత హామీలతో ప్రభుత్వ ఖజానాపై గణనీయమైన, లెక్కించలేని ఆర్థిక భారం పడుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓట్లు పొందిన అనంతరం.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చేలా నిర్థారించడానికి ఎలాంటి యంత్రాంగం లేదని తెలిపారు.

➡️