ఖర్గే హెలికాప్టర్‌లో ఇసి సోదాలు

May 12,2024 23:57 #EC searches, #Kharge helicopter

– ప్రతిపక్షాల నేతలను టార్గెట్‌ చేయడంపై కాంగ్రెస్‌ అభ్యంతరాలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే హెలికాఫ్టర్‌ను బీహార్‌లో ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. బీహార్‌లోని సమస్తిపూర్‌, ముజఫర్‌పూర్‌ల్లో ఖర్గే శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గన్నారు. ఈ సందర్భంగా సమస్తిపూర్‌లో ఖర్గే హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రతిపక్ష నాయకులనే ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించింది. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ నాయకులను మాత్రం ఇష్టానుసారం తిరగడానికి అనుమతిస్తున్నారని పేర్కొంది. గతంలో రాహుల్‌గాంధీ హెలికాప్టర్‌ను కేరళలో తనిఖీ చేశారని, ఇప్పుడు బీహార్‌లో ఖర్గే హెలికాప్టర్‌ను తనిఖీ చేశారని కాంగ్రెస్‌ పార్టీ బీహార్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేశ్‌ రాథోర్‌ తెలిపారు. అలాగే అధికారులు తనిఖీ చేస్తున్న వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు. ‘కాంగ్రెస్‌ నాయకుల హెలికాప్టర్లను తనిఖీ చేయడం సాధారణ విషయమేనా? ఎన్‌డిఎ అగ్రనాయకుల హెలికాఫ్టర్లలోనూ ఇలాంటి తనిఖీలు చేశారా? ఈ విషయాన్ని ఎన్నికల సంఘం స్పష్టం చేయాలి’ అని రాథోర్‌ ప్రశ్నించారు. ‘ఇలాంటీ రికార్డులన్నింటీని ఇసి బహిరంగపరచాలి లేకుండే ఇసి ప్రతిపక్ష నాయకులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వారిని నిరోధించడానికి, ఎన్‌డిఎ నాయకులను స్వేచ్ఛగా తిరగడానికి అనుమతించినట్లు అర్థం అవుతుంది’ అని పేర్కొన్నారు.

➡️