అనిశ్చితి ఉన్నా ఆర్థిక సుస్థిరత

  • ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రపంగంలో రాష్ట్రపతి
  • మధ్య తరగతిని ఉద్ధరించామని ఉద్ఘాటన
  • జమిలి, వక్ఫ్‌ బిల్లుకు వత్తాసు
  • నేడు కేంద్ర బడ్జెట్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అనిశ్చితి ఉన్నా ఆర్థిక సుస్థిరత సాధించామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ‘విధాన పరమైన పక్షవాత’ స్థితి నుండి ఆర్థిక వ్యవస్థను బయటకు తీసుకురావడానికి ప్రభుత్వం దృఢ సంకల్పంతో కృషి చేసిందని ముక్తాయించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం పార్లమెంటు సెంట్రల్‌ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉభయ సభల సంయుక్త సమావేశాన్నుద్దేశించి అమె ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని కేంద్ర మంత్రివర్గం రూపొందిందిస్తుంది. దానినే రాష్ట్రపతి పొల్లు పోకుండా చదివి వినిపిస్తారు. ద్రౌవపది ముర్ము కూడా అదే పనిచేశారు. కోవిడ్‌, యుద్ధాలు, ఘర్షణలు ఇలా పలు రకాలైన అనిశ్చిత పరిస్థితులను అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం గుర్తించదగిన సుస్థిరతను ప్రదర్శిస్తూ తన బలాన్ని నిరూపించుకుందని అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ సుస్థిరతకు మూలస్తంభంగా నిలిచిన భారత్‌ యావత్‌ ప్రపంచానికి ఒక ఉదాహరణగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రధానంగా మధ్య తరగతి వర్గాల గురించి పదే పదే ప్రస్తావించారు. . మధ్య తరగతి ప్రజలు ఎంత పెద్ద కలలు కంటే దేశం అంత ఎత్తుకు ఎదుగుతుందని వ్యాఖ్యానించారు.

జమిలి ఎన్నికలు (ఒకే దేశం, ఒకే ఎన్నిక), వక్ఫ్‌ సవరణ బిల్లును సాహసోపేత నిర్ణయాలుగా ఆమె అభివర్ణించారు. ప్రపంచంలోనే భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలపనున్నట్లు తెలిపారు. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఒక దేశం, ఒక ఎన్నికకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. ‘బడ్జెట్‌-2025లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాల గురించి ఏకరువు పెట్టారు. ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని నియమించామన్నారు. ఒక దేశం, ఒక ఎన్నిక గురించి పాత పాటే పాడారు. భారత్‌ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పారు. .

చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లతో గొప్ప ముందడుగు వేస్తున్నామని,భారతీయులు అంతరిక్షంలో అడుగుపెట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.. విద్యా రంగంపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. దేశాన్ని గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ పవర్‌ హౌస్‌గా మారుస్తామని పేర్కొన్నారు. ఇండియా ఎఐ మిషన్‌ను ప్రారంభించామని, నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ప్రారంభించామని చెప్పారు. ఈ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నామని, పౌర విమానయాన రంగం అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

పోలవరం గురించి ప్రస్తావన

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రప్రభుత్వం కృషి చేస్తోందని, పోలవరం నిర్మాణానికి రూ.12 వేల కోట్లు కేటాయించామని ముర్ము గుర్తుచేశారు. సైబర్‌ సెక్యూరిటీలో సమర్థత పెంచుతున్నామని, దేశ ఆర్థిక, సామాజిక, జాతీయ భద్రతకు పనిచేస్తున్నామని తెలిపారు. డిజిటల్‌ మోసాలు, సైబర్‌ నేరాలు, డీప్‌ ఫేక్‌ పెనుముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు, వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని, ఆదివాసీ ప్రాంతాల్లో 30 వైద్య కళాశాలలు ప్రారంభించామని, ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

కొత్త దనం లేని ప్రసంగం!

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం అసాంతం కొత్తదనం ఏమీ లేదు. అదే ప్రసంగం.. అవే వ్యాఖ్యలు. ప్రసంగమంతా ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అదే సమయంలో దేశంలో నెలకొన్న కీలక అంశాలను కూడా విస్మరించారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర కోసం సుదీర్ఘ కాలంగా సాగిస్తున్న పంజాబ్‌ రైతుల పోరాటాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. మహా కుంభమేళాలో తొక్కిసలాట మరణాలను కూడా విస్మరించారు. రాష్ట్రపతి ప్రసంగం పేలవంగా ఉందని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.

మాజీ ప్రధాని మన్మోహన్‌కు నివాళి

అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు పార్లమెంట్‌ ఉభయ సభలు నివాళులు అర్పించాయి. ప్రధానిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనలోని మృతులకు ఉభయ సభల సభ్యులు నివాళులర్పించారు.

పేలవంగా రాష్ట్రపతి ప్రసంగం : సోనియాగాంధీ

రాష్ట్రపతి ప్రసంగం పేలవంగా ఉందని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై వివాదం చెలరేగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై స్పందించాలని సోనియా గాంధీని మీడియా ప్రతినిధులు అడిగారు. ‘రాష్టప్రతి చివరి వరకు చాలా అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయారు. పేలవంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌ గాంధీ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై స్పందించారు. తన తల్లి వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ‘బోరింగ్‌.. నో కామెంట్స్‌.. అదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారా?’ అంటూ సోనియాగాంధీ మాటల భావాన్ని ప్రస్తావించారు.

సోనియా వ్యాఖ్యలను తప్పుబట్టిన రాష్ట్రపతి భవన్‌

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు సమావేశాలను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని బిజెపి డిమాండ్‌ చేసింది. ఆ తరువాత కొద్ది సేపటికే రాష్ట్రపతి భవన్‌ సైతం ఒక ప్రకటన విడుదల చేసింది. సోనియా గాంధీ వ్యాఖ్యలను తప్పుపట్టింది. అత్యున్నత పదవిలో ఉన్నవారి హోదాను కించపరిచేలా ఉన్నాయని పేర్కొంది. ‘ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి అలసిపోయారని, మాట్లాడలేకపోయారని కొందరు కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు మాట్లాడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. చాలా స్పష్టంగా దేశ అత్యున్నత కార్యాలయం హోదాను తగ్గించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. వారి మాటల్లో ఎంతమాత్రం వాస్తవం లేదు. ప్రసంగం చివరి వరకూ రాష్ట్రపతి ఎక్కడా అలసిపోలేదు. నిజానికి అణగారిన తరగతులు, మహిళలు, రైతుల గురించి మాట్లాడేటప్పుడు ఎలాంటి అలసటను దగ్గరకు రానివ్వరాదని రాష్ట్రపతి బలంగా నమ్ముతారు’ అని రాష్ట్రపతి భవన్‌ పేర్కొంది. బహుశా హిందీ వంటి భారతీయ భాషల్లో ప్రసంగాలు, నుడికారాల గురించి పరిచయం లేకపోవడం వల్ల కాంగ్రెస్‌ నాయకులు దానిని సరిగ్గా అర్థం చేసుకుని ఉండకపోవచ్చని అభిప్రాయపడింది.

➡️