మహువా మొయిత్రాపై ఇడి కేసు

Apr 2,2024 23:30 #ED case, #Mahua Moitra

– దర్శన్‌ హిరాందానీపై కూడా
న్యూఢిల్లీ : ముడుపులు తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగిన కేసుకు సంబంధించి తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రా, వ్యాపారవేత్త దర్శన్‌ హిరాందానీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఆ ఇద్దరిపై పోలీసు ఎఫ్‌ఐఆర్‌తో సమానమైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఇసిఐఆర్‌)ను దాఖలు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రెండు మూడు రోజుల క్రితమే ఇడి కేసు నమోదు చేసింది. మొయిత్రా నివాసంపై గత నెల్లో సోదాలు జరిపిన సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈసారి ఎన్నికల్లో కూడా ఆమె తృణమూల్‌ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ, ప్రధాని మోడీ ప్రభృతులపై దాడిని ఉధృతం చేసేందుకు హిరాందానీ నుండి బహుమతులు, ముడుపులు తీసుకుని బదులుగా పార్లమెంట్‌లో మొయిత్రా ప్రశ్నలు అడిగారని బిజెపి నిషికాంత్‌ దూబే ఆరోపించారు. ఆ ఆరోపణలపైన ప్రాధమిక విచారణ అనంతరం లోక్‌పాల్‌ సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది.

➡️