తక్షణ దర్యాప్తు అవశ్యం
అదానీ కేసుపై పలు పత్రికల సంపాదకీయాల వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : అదానీ కేసు విచారణపై అమెరికా కన్నా భారతదేశమే ఎక్కువ ఆసక్తి చూపాలని, చొరవ తీసుకోవాలని పలు జాతీయ మీడియాలు తమ సంపాదకీయాల్లో పేర్కొన్నాయి. తక్షణమే ఈ అభియోగాలపై దర్యాప్తు చేపట్టాల్సిన ఆవశ్యకతను ముక్త కంఠంతో స్పష్టం చేశాయి.
సౌర విద్యుత్ కాంట్రాక్టులను దక్కించుకోవడం కోసం గౌతమ్ అదానీతో పాటు ఆ గ్రూప్‌నకు చెందిన మరో ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు రూ.2.029 కోట్ల ముడుపులు ఇవ్వజూపడం లేదాఇస్తామని వాగ్దానం చేయడం వంటివి జరిగాయని అమెరికా న్యాయశాఖ అక్కడి కోర్టుకు తెలిపింది. ఇందుకు సంబంధించి 54పేజీల నేరాభియోగపత్రాన్ని న్యాయవాదులు కోర్టులో దాఖలు చేశారు.
ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్ణించింది. ప్రభుత్వ సౌర విద్యుత్ కాంట్రాక్టులపై తాజా వివాదం రేగింది. అదానీతో ప్రధాని మోడీ సంబంధాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
ఈ నేపథ్యంలో అదానీ చుట్టూ రేగిన వివాదంపై పత్రికల సంపాదకీయాలు ఏమన్నాయో చూద్దాం :
అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్‌ఇసి) అభియోగాలు, నిధుల సమీకరణపై గల ప్రభావాల దృష్ట్యా ఈసారి అదానీలు మరింత క్లిష్టమైన సమయాన్ని ఎదుర్కొనాల్సి వుంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా తన సంపాదకీయంలో పేర్కొంది. చాలా తక్కువ సమయంలోనే ఇన్ని వివాదాల్లో ఒక బడా కార్పొరేట్ సంస్థ చిక్కుకోవడం చాలా అరుదని వ్యాఖ్యానించింది. పలు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే అదానీ గ్రూపు వంటి సంస్థకు అంతర్జాతీయంగా ఇది మంచిది కాదని పేర్కొంది. సమీప భవిష్యత్తులో అమెరికాలో ఈ సంస్థ నిధులు సమీకరించడం ఇక క్లిష్టతరమవుతుందని వ్యాఖ్యానించింది. భారత్‌లో కూడా ఈ గ్రూపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారు మరోసారి తీవ్రంగా దెబ్బ తిన్నారు. దీంతో స్వదేశంలో ఈ గ్రూపు పట్ల ఇన్వెస్టర్లు, రుణదాతల్లో కచ్చితంగా ఒక అప్రమత్తత నెలకొంటుంది. వివిధ రంగాల్లో మౌలిక వసతుల రూపకల్పన,నిర్మాణ కార్యకలాపాలే అదానీ కీలక వ్యాపారమైనందున వీటికి నిధుల దాహం కూడా అధికమే, అందువల్ల పెద్ద మొత్తంలో నిధుల సమీకరణ కోసం ఆధారపడక తప్పదు. అయితే విదేశాల్లో బిజినెస్ చేయాలనుకుంటున్న అమెరికన్ కంపెనీలకు సక్రమంగా లేదంటూ ఎఫ్‌సిపిఎ (విదేశీ అవినీతి కార్యకలాపాల నిరోధక చట్టం) ను రద్దు చేయాలనిట్రంప్ తన మొదటి పదవీ కాలంలోనే భావించారు. ఇక ట్రంప్ తన తాజా పదవీ కాలంలో ఈ రద్దుతో ముందుకు సాగాలనుకోవడం మంచి వ్యూహం కాకపోవచ్చునని వ్యాఖ్యానించింది.
ఈ అభియోగాల్లోని వాస్తవాలను వెలికి తీయడంలో అమెరికా సంస్థల కన్నా భారత సంస్థలే మరింత వేగంగా, ఆసక్తిగా, చొరవ తీసుకుని పనిచేయాల్సి వుందని డెక్కన్ హెరాల్డ్ పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. ”ప్రధాని మోడీ, బిజెపి అదానీకి సన్నిహితంగా వున్నప్పటికీ.. ఈ గ్రూపు దుర్వినియోగం అభియోగాల నేపథ్యంలో రక్షణ కల్పించకూడదు. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తిరస్కరించింది. అయితే మొత్తంగా అభియోగాలన్నింటినీ స్థూలంగా తిరస్కరించడమనేది విశ్వసనీయ ప్రతిస్పందన కాబోదు. అదానీ గ్రూపుపై ఆరోపణలు వచ్చినప్పుడల్లా బిజెపి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమర్థించాలనే చూస్తోంది. కానీ, ఇప్పుడు ‘చట్టం తన పనితాను చేసుకుపోతుంది’ అని పార్టీ వ్యాఖ్యానిస్తోంది. అయితే అది జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే వుంది.’ అని ఆ సంపాదకీయం పేర్కొంది.
ఈ విషయంపై స్పష్టత రావాలంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరమని ట్రిబ్యూన్ సంపాదకీయం వ్యాఖ్యానించింది. విచారణ చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపాదకీయం కూడా స్పష్టం చేసింది. భారతీయ మార్కెట్లను దెబ్బతీయడానికి అంతర్జాతీయంగా పన్నిన కుట్రలో భాగమే ఇది అంటూ బిజెపి ప్రతినిధి వ్యాఖ్యానించడం చూస్తుంటే భారతీయ ఇన్వెస్టర్ల తెలివితేటలను అవమానించడమే అవుతుందని పేర్కొంది. ముడుపులు ఇతరులకు అందాయా లేదా, సెకీ కేవలం ఒక సాధనంగా మాత్రమే వుందా లేదా అన్న విషయాలను భారత పౌరులు కచ్చితంగా తెలుసుకోవాల్సి వుందని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ సంపాదకీయం పేర్కొంది.
ప్రముఖంగా ఫ్రంట్ పేజీల్లో ఆంగ్ల పత్రికల పతాక శీర్షికలు
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికా న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలైన వార్తను దేశవ్యాప్తంగా పలు ఆంగ్ల దినపత్రికలు ప్రముఖంగా ఫ్రంట్ పేజీలో ప్రచురించాయి. ‘అమెరికా సౌర తుపానులో చిక్కుకున్న అదానీ’ అనే పతాక శీర్షికతో ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ఈ వార్తను ప్రముఖంగా ఇచ్చింది. ఈ పరిణామాలతో అదానీ గ్రూపు స్టాక్‌లు ఎలా భారీగా పతనమయ్యాయో, మార్కెట్‌లో రూ.26లక్షల కోట్లు కంపెనీ నష్టపోయిన వైనాన్ని వివరించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి బాగోతాన్ని కూడా ఇచ్చింది. ‘సౌర విద్యుత్ కుంభకోణం దర్యాప్తులో అదానీని అభిశంసించిన అమెరికా’ అనే శీర్షికతో మింట్ ఈ వార్తను ప్రముఖంగా ఇచ్చింది. అదానీ ఇచ్చిన ముడుపుల వివరాలను కూడా ఇచ్చింది. అలాగే ఈ ఆరోపణలకు ప్రతిగా తాము చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామంటూ అదానీ గ్రూపు చేసిన ప్రకటన కూడా ఇచ్చింది.
టెలిగ్రాఫ్ తనదైన శైలిలో హెడ్డింగ్‌ను ‘జస్టిస్ ఫర్ ఆ(ల్)దాని’ అనిపెట్టింది. బిజెపిని గౌతమ్ గ్లాడియేటర్స్‌గా వ్యాఖ్యానించింది. ‘అదానీ, ఆయన మేనల్లుడుపై అమెరికాలో అరెస్టు వారంట్లు’ అను శీర్షిక ట్రిబ్యూన్‌లో వచ్చింది. ‘అదానీని కదిలించిన అమెరికా అభియోగాలు’ అను శీర్షికతో ఎకనామిక్ టైమ్స్ వార్త ఇచ్చింది. విదేశాల్లో నిధులు సమీకరించడం ఈ గ్రూపునకు కష్టమైందని వ్యాఖ్యానించింది.