గనిలో చిక్కుకున్న అధికారులను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం

May 15,2024 12:36 #Kolihan mine, #Rajasthan

జైపూర్‌ : రాజస్థాన్‌లోని నీమ్‌ కా థానా జిల్లాలో కోలిహన్‌ గని వద్ద మంగళవారం రాత్రి ప్రమాదం సంభవించింది. హిందుస్తాన్‌ కాపర్‌ లిమిటెడ్‌కు చెందిన అధికారులు, విజిలెన్స్‌ బృందం తనిఖీలు చేసేందుకు వందల మీటర్ల మేర గనిలోకి దిగారు. వారంతా పైకి వస్తున్న సమయంలో షాఫ్ట్‌ (ఉద్యోగులను గని లోపలకి, బయటకు తరలించేది) వైర్‌ తెగిపోయింది. దీంతో వారంతా 18 వేల అడుగుల లోపలికి వెళ్లిపోయారు. గని లోపలకు వెళ్లిన 14 మంది అధికారులు లోపలే చిక్కుకుపోయారు. వీరిని బయటకు తీసుకు వచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి 10 మందిని బయటకితీశారు. ఇంకా గనిలో చిక్కుకున్న నలుగురిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అధికారులు వెల్లడించారు.
కాగా, ఈ ఘటనపై నీమ్‌ కా థానా ఎస్‌పి ప్రవీణ్‌ నాయక్‌ మాట్లాడుతూ.. ‘గని నుంచి ఇప్పటివరకు 10 మందిని రక్షించాము.ఇక మిగిలిన వారిని కూడా రక్షించేందుకు మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.’ అని ఆయన అన్నారు. బయటకు వచ్చిన వారిలో కొంతమంది కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో జైపూర్‌కి తరలించామని ఝుంజును ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌ ప్రవీణ్‌ శర్మ అన్నారు.

 

➡️