అలక పాన్పుపై ఏక్‌నాథ్‌ షిండే

Dec 1,2024 06:52 #cm post, #Eknath Shinde, #Maharashtra
  • ముంబయి వీడి సొంతూరిలో మకాం
  • భవిష్యత్‌పై ఒకట్రెండు రోజుల్లో కీలక ప్రకటన
  • 5న సిఎం పదవీ స్వీకార ప్రమాణానికి బిజెపి ఏర్పాట్లు

ముంబయి : మహారాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అలకబూనారా? బిజెపి పెద్దలతో వరుస భేటీల అనంతరం అనారోగ్య సమస్యల పేరిట ఆయన ముంబయి వీడి తన సొంతూరు సతారా జిల్లాలోని దారే తంబ్‌ గ్రామానికి మకాం మార్చడం, మరోవైపు పేరు ఖరారు చేయకుండానే ఈ నెల 5న ముఖ్యమంత్రి పదవీస్వీకార ప్రమాణోత్సం జరుగుతుందని, ప్రధాని మోడీ హాజరవుతారని బిజెపి ప్రకటించడం వంటి పరిణామాలు చూస్తే ఏక్‌నాథ్‌ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసిపోతుంది. ఆయన అనుచరులు, శివసేన చీలిక గ్రూపు నేతలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఏక్‌నాథ్‌ షిండే భవిష్యత్‌పై కీలక ప్రకటన చేయనున్నారని శివసేన నాయకులు సంజరు శిర్షాత్‌ శనివారం ప్రకటించారు. అయితే ఏక్‌నాథ్‌ షిండే వరుస పర్యటనల వల్ల తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, ఇతర శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు కూడా ఉన్నాయని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.

ముఖ్యమంత్రి ఎవ్వరో..!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో ఇప్పటికీ బిజెపి అధిష్టానం తేల్చడం లేదు. దేవేంద్ర ఫడ్నవీస్‌ సిఎం అవుతారా.. లేక మరొకరిని తీసుకువచ్చి సిఎం కుర్చీపై కూర్చోపెడతారా..అన్న ఉత్కంఠ నెలకొంది. మహాయుతికి మెజార్టీ వచ్చిన వారం రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ తేదీని ప్రకటించారు. డిసెంబర్‌ 5న సాయంత్రం 5 గంటలకు ముంబయిలోని ఆజాద్‌ మైదాన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని మహారాష్ట్ర బిజెపి అధ్యక్షులు చంద్రశేఖర్‌ బవాన్‌కులే ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారని తెలిపారు. అయితే సిఎం ఎవరన్నది మాత్రం ప్రస్తావించక పోవటం గమనార్హం. అయితే కొత్త సిఎంగా బిజెపి సీనియర్‌ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతున్నా.. రేసులో కొత్తగా మురళీధర్‌ మోహౌల్‌ పేరు తెరపైకి వచ్చింది. బిజెపి పుణె ఎంపి అయిన మురళీధర్‌ ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈయన మహారాష్ట్ర సిఎంగా బాధ్యతలు స్వీకరిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండగా ఆ పోస్టులపై మురళీధర్‌ స్పందించారు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ఇదంతా బాగానే ఉన్నా… మరి ఫడ్నవీస్‌ సిఎం క్యాండెట్‌ అయితే..ప్రమాణ స్వీకారోత్సవ ముహూర్తం ఖరారు చేసి పేరు ఎందుకు ప్రకటించలేదనే ప్రశ్న ఉదయిస్తోంది. అంటే అటు ఫడ్నవీస్‌, ఇటు షిండే కాకుండా మరొకరిని తెచ్చి సిఎం పీఠంపై కూర్చోపెట్టాలని బిజెపి అధిష్టానం ఎత్తులు వేస్తుందా అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సీఎం రేసులో మురళీధర్‌, వినోద్‌ తావ్డే, రాధాకృష, విఖే-పాటిల్‌ వంటి ప్రత్యామ్నాయ పేర్లను అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

➡️