పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లే ఎక్కువ
ముంబయి : మహారాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు అన్ని నియోజవర్గాల్లోనూ లెక్కించిన ఓట్లకు, పోలైన ఓట్లకు మధ్య తేడా కన్పించింది. ఎన్నికల కమిషన్ అందించిన సమాచారం ప్రకారం మహారాష్ట్ర ఎన్నికల్లో 66.05 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే ఈ లెక్కన 6,40,88,195 ఓట్లు పోలయ్యాయన్న మాట. వీటిలో పురుషులు వేసినవి 3,06,49,318 ఓట్లు కాగా మహిళల ఓట్లు 3,34,37,057, ఇతరుల ఓట్లు 1,820 ఉన్నాయి. అయితే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కలిపి లెక్కించిన ఓట్లు 6,45,92,508. అంటే పోలైన ఓట్ల కంటే 5,04,313 ఓట్లను అదనంగా లెక్కిచారు. ఇదెలా సాధ్యం?
రాష్ట్రంలోని ఎనిమిది నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు తక్కువగా ఉన్నాయి. మిగిలిన 280 స్థానాల్లోనూ పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లే అదనం. అస్థి స్థానంలో జరిగిన లెక్కింపులో భారీ వ్యత్యాసం కన్పించింది. అక్కడ పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు 4,538 ఎక్కువ వచ్చాయి. ఉస్మానాబాద్ స్థానంలో ఈ వ్యత్యాసం 4,155 ఓట్లు.
లోక్‌సభ ఎన్నికల సమయంలోనే…
మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఈ తేడాలు కన్పించాయి. పోలైన ఓట్లకు, ఫారం 17సి లోని సమాచారానికి మధ్య వ్యత్యాసం ఉంది. 17సి పత్రంలో ప్రతి పోలింగ్ స్టేషన్‌లో పోలైన ఓట్ల సంఖ్యను నమోదు చేస్తారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ ప్రతి దశలోనూ ఓటింగ్ ముగిసిన 48 గంటల్లోగా పోలింగ్ కేంద్రాల వారీగా పడిన ఓట్ల వివరాలను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించింది. ప్రాథమిక, తుది పోలింగ్ వివరాల మధ్య 5-6 శాతం వ్యత్యాసం కన్పిస్తోందని తెలిపింది. అయితే ఎడిఆర్ అభ్యర్థనకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు.
అలా చేస్తే ఆచరణలో కొన్ని సమస్యలు ఎదురవుతాయని చెప్పింది. ఫారం 17సి లోని సమాచారాన్ని అభ్యర్థుల ఏజెంట్లకు మాత్రమే అందజేస్తాము తప్పించి ఆ వివరాలు ప్రజలకు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్ చెబుతోంది.
ఇవి ఉదాహరణలు మాత్రమే
షెడ్యూల్డ్ తెగలకు కేటాయించిన నవాపూర్ స్థానాన్నే ఉదాహరణగా తీసుకుంటే అక్కడ పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు అధికంగా ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,95,786. అక్కడ 81.15 శాతం అంటే 2,40,022 ఓట్లు పోలయ్యాయి. అయితే లెక్కించిన ఓట్లు మాత్రం 2,41,193. అంటే పోలైన ఓట్ల కంటే 1,171 అదనం. ఇక్కడ గెలుపొందిన అభ్యర్థి మెజారిటీ 1,122 ఓట్లు. మరో ఉదాహరణ చూద్దాం. మావల్ స్థానంలో పోలైన ఓట్ల కంటే తక్కువ లెక్కించారు. ఈ నియోజకవర్గంలో 2,80,319 ఓట్లు పోలయ్యాయి. అయితే 2,79,081 ఓట్లను మాత్రమే లెక్కించారు. అంటే పోలైన ఓట్ల కంటే 1.238 ఓట్లను తక్కువగా లెక్కించారన్న మాట. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాత చాలా ముఖ్యమని, ఎన్నికల సంఘం దీనిపై మరింత దృష్టి సారించాలని నిపుణులు కోరుతున్నారు.