ముంబయి : ఎల్గర్ పరిషత్-మావోయిస్టు సంబంధాల కేసులో పరిశోధకులు రోనా విల్సన్, హక్కుల కార్యకర్త సుధీర్ ధావలేకు బాంబే హైకోర్ట్ బుధవారం బెయిల్ మంజూరు చేసింది. 2018 జనవరి 1వ తేదీన మహారాష్ట్రలోని పూనేలో జరిగిన భీమా కోరేగావ్ హింసకు సంబంధించి ఎల్గర్ పరిషత్ కేసు నమోదైంది. భీమా కోరేగావ్‌లో నాటి భూస్వామ్య పాలకులపై దళితులు, ఇతర అణగారిన ప్రజలు సాగించిన ధీరోదాత్తమైన పోరాట 200వ వార్షికోత్సవం సందర్భంగా 2017 డిసెంబర్ 31న పూనేలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఎల్గర్ పరిషత్ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పౌర హక్కుల నేతలను, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న మోడీ సర్కార్ ఈ ఎల్గర్ మిగతా 7లో
పరిషత్ కార్యక్రమాన్ని సాకుగా చెబుతూ అనేక మందిపై అక్రమ కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. నిషిద్ధ మావోయిస్టు సంస్థలు ఈ ఎల్గర్ పరిషత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయని పోలీసులు ఆరోపించారు. డిసెంబర్ 31న జరిగిన ఎల్గర్ పరిషత్ కార్యక్రమంలో వక్తలు చేసిన ప్రసంగాలు ఆ మరునాడు హింసకు దారితీశాయని అభాండాలు మోపారు. మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్, గుజరాత్ ఎమ్మెల్యే జిగేష్ మెవానీ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది. భీమా కోరేగావ్ హింసలో ఒక వ్యక్తి చనిపోగా అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు.
ఈ కేసుల్లోనే 2018 ఏప్రిల్‌లో పూనే పోలీసులు ఢిల్లీలోని రోనా విల్సన్ ఇంటిపై దాడి చేసి ఆయనను అరెస్ట్ చేశారు. అదే ఏడాది జూన్‌లో మానవ హక్కుల కార్యకర్త సుధీర్ ధావలేను కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. ఈ కేసులో సుధీర్ భరద్వాజ్, గౌతమ్ నవ్‌లఖా, వెర్నన్ గన్‌సాల్వ్స్, అరుణ్ ఫెరైరా, వరవరరావులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణను 2020 ఫిబ్రవరిలో జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు.