‘ఉపాధి హామీ’లో లోపాలెన్నో!

Apr 14,2025 02:19 #Employment, #guarantee, #many flaws
  • స్వతంత్ర సర్వేకు పార్లమెంటరీ ప్యానెల్‌ సిఫార్సు

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌) ప్రభావాన్ని, లోపాలను తెలుసుకోవడానికి స్వతంత్ర సర్వే నిర్వహించాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ (గ్రామీణాభివృద్ధి) సిఫార్సు చేసింది. కార్మికుల సంతృప్తి, వేతనాల్లో జాప్యం, భాగస్వామ్య ధోరణులు, పథకంలోని ఆర్థిక అవకతవకలు.. వంటి అంశాలపై ఈ సర్వే నిర్వహించాలని కమిటీ సూచించింది. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజున అంటే ఈ నెల 4న ఈ కమిటీ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ కమిటీకి కాంగ్రెస్‌ ఎంపి సప్తగిరి శంకర్‌ ఉలక అధ్యక్షుడిగా ఉన్నారు. అవసరమైన విధాన సంస్కరణలపైనా సర్వే నిర్వహించాలని ప్యానెల్‌ పేర్కొంది.

ఉపాధి హామీలో ఎస్‌సి, ఎస్‌టి, మహిళా కార్మికుల భాగస్వామ్యం దేశవ్యాప్తంగా సంతృప్తికరంగా లేదని ప్యానెల్‌ విమర్శించింది. వీరు సమాన పని అవకాశాలు, ప్రయోజనాలు పొందేలా అధ్యయనం నిర్వహించాలని కోరింది. మారుతున్న కాలం, ముందుకొస్తున్న కొత్త సవాళ్లను దృష్టిలో ఉంచుకుని చట్టాన్ని పునరుద్ధరించాల్సి ఉందని సూచించింది. ప్రస్తుతం హామీ ఇచ్చిన పనిదినాల సంఖ్యను 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను కమిటీ కోరింది.

వేతన చెల్లింపుల్లో దీర్ఘకాల జాప్యం

వేతన చెల్లింపుల్లో దీర్ఘకాల జాప్యం ఉపాధి హామీని పట్టిపీడిస్తుందని, దీనివల్ల కార్మికులు అనిశ్చితిలో ఉంటున్నారని పార్లమెంటరీ ప్యానెల్‌ పేర్కొంది. వేతనాల జాప్యానికి ప్రస్తుతం చెల్లిస్తున్న పరిహారాన్ని పెంచాలని సిఫార్సు చేసింది. కార్మికుల్లో నమ్మకాన్ని కొనసాగించడానికి, అంతరాయం లేకుండా పనులు చేయడానికి సకాలంలో వేతనాలు చెల్లించడం చాలా అవసరమని కమిటీ పేర్కొంది.

అటకెక్కిన అమర్‌జిత్‌సిన్హా ప్యానెల్‌ నివేదిక

ఉపాధిహామీలో లోపాలను ముఖ్యంగా అంతర్‌-రాష్ట్ర వైవిధ్యాలను సమీక్షించడానికి కేంద్రం ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి అమర్‌జిత్‌ సిన్హా నేతృత్వంలో కేంద్రం 2022లో నియమించిన ప్యానెల్‌ 2023లో నివేదికను సమర్పించింది. ఆ ప్యానెల్‌ సూచనలు ఇంకా అమలు కాలేదు. హామీ ఇచ్చిన పనిదినాలు, వేతనాల ప్రయోజనాలు కార్మికులకు అందడం లేదని అమర్‌జిత్‌ సిన్హా ప్యానెల్‌ విమర్శించింది. తమిళనాడు వంటి ఆర్థికంగా మెరుగైన రాష్ట్రాలతో పోలిస్తే బీహార్‌వంటి ఎక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో పెడుతున్న వ్యయం చాలా తక్కువగా ఉందని తెలిపింది.

➡️