న్యూఢిల్లీ : ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం (ఇఎల్‌ఐ) మోడీ ప్రభుత్వ మరో మోసపూరిత ప్రకటన అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ శుక్రవారం విమర్శించారు. ప్రధాని రోజుకో కొత్త నినాదం సృష్టిస్తున్నారని, వాటిలో ఇది ఒకటని అన్నారు. కానీ యువత నిజమైన ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.
2024 ఎన్నికల తర్వాత, ప్రధాని మోడీ ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం పథకాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారని, యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ పథకాన్ని ప్రకటించి సుమారు ఏడాది కావస్తోందని, కానీ అమలు చేయలేదని అన్నారు. ఆ పథకం కోసం కేటాయించిన రూ.10,000 కోట్ల నిధులను కూడా వెనక్కు తీసుకున్నారని, ఈ చర్య నిరుద్యోగంపై మోడీ వైఖరిని తెలియజేస్తోందని దుయ్యబట్టారు.
పెద్ద కార్పోరేట్‌లపై మాత్రమే దృష్టిసారించడం, నిష్పాక్షిక, న్యాయమైన వ్యాపారాల కన్నా తన స్నేహితులను ప్రోత్సహించడం, స్వదేశీ నైపుణ్యాలను విస్మరించడంతో ఉద్యోగాలను సృష్టించలేమని అన్నారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం, పోటీ పడగల నిష్పాక్షిక మార్కెట్లు, స్థానిక ఉత్పత్తి, నెట్‌వర్క్‌లకు మద్దతు ఇవ్వడం, సరైన నైపుణ్యంతోనే కోట్లాది ఉద్యోగాలను సృష్టించగలమని అన్నారు.
ప్రధాని మోడీ ఈ ఆలోచనలతో ఏకీభవించరని అన్నారు. ” ప్రధాని గారు.. మీరు గొప్పగా ఇఎల్‌ఐ పథకాన్ని ప్రకటించారు. కానీ రూ.10,000 కోట్ల పథకం ఎందుకు అదృశ్యమైంది. మీరు మీ వాగ్దానాలను పక్కనపెట్టినట్లు, నిరుద్యోగ యువతను కూడా విడిచిపెట్టారా. ఉద్యోగాలను సృష్టించడానికి మీ ప్రణాళిక ఏమిటి లేదా ఇది కూడా మరో మోసపూరిత ప్రకటనేనా” అని మోడీని నిలదీశారు.